Elon Musk Starlink: ‘ఎలన్‌మస్క్‌, స్టార్‌లింక్‌పై క్రిమినల్‌ కేసు పెట్టండి’

30 Nov, 2021 08:30 IST|Sakshi

ప్రభుత్వానికి టెలికం వాచ్‌డాగ్‌ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: లైసెన్సు లేకుండానే శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు అందిస్తామంటూ కస్టమర్ల నుంచి డబ్బు వసూలు చేసినందుకు గాను అమెరికన్‌ సంస్థ స్టార్‌లింక్‌పై క్రిమినల్‌ కేసు పెట్టాలని ప్రభుత్వానికి స్వచ్ఛంద సంస్థ టెలికం వాచ్‌డాగ్‌ విజ్ఞప్తి చేసింది. నవంబర్‌ 27న టెలికం కార్యదర్శికి ఈ మేరకు లేఖ రాసింది. ఈ విషయంలో తగు స్థాయిలో సత్వర చర్యలు తీసుకోనందుకు గాను సంబంధిత అధికారులపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. 2021 ఫిబ్రవరి నుంచే స్టార్‌లింక్‌ ప్రీ–బుకింగ్‌ ప్రారంభించినప్పటికీ దీనికి సంబంధించిన ఆదేశాలు ఇవ్వడంలో టెలికం శాఖ (డాట్‌) తీవ్ర జాప్యం చేసిందని పేర్కొంది. ఈలోగా అమాయక కస్టమర్ల నుంచి స్టార్‌లింక్‌ భారీగా దండుకుందని టెలికం వాచ్‌డాగ్‌ తెలిపింది. కంపెనీ చెప్పే లెక్కలు బట్టి చూస్తే 11,000 కస్టమర్ల నుంచి దాదాపు 10,89,000 డాలర్లు వసూలు చేసినట్లుగా తెలుస్తోందని వివరించింది.

అనుమతులు తీసుకోకుండానే కష్టమర్ల నుంచి చందాలు వసూలు చేసిన వ్యవహారంపై సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌తో విచారణ జరిపించాలని, కస్టమర్ల నుంచి వసూలు చేసిన డబ్బును వడ్డీతో సహా, ఎలాంటి కోతలు లేకుండా, స్టార్‌లింక్‌ పూర్తిగా రిఫండ్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని టెలికం వాచ్‌డాగ్‌ కోరింది. అమెరికా ఎలక్ట్రిక్‌ వాహనాల దిగ్గజం ఎలాన్‌ మస్క్‌కు చెందిన శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల సంస్థ స్టార్‌లింక్‌.. భారత్‌లోనూ కార్యకలాపాలు మొదలుపెట్టే సన్నాహాల్లో ఉంది. ప్రీ–బుకింగ్‌ కూడా చేపట్టింది. అయితే, స్టార్‌లింక్‌కు లైసెన్సు ఇవ్వలేదని, కంపెనీ సర్వీసులకు సబ్‌స్క్రయిబ్‌ చేయరాదని డాట్‌ ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే టెలికం వాచ్‌డాగ్‌ ఫిర్యాదు ప్రాధాన్యం సంతరించుకుంది.  
 

చదవండి: Starlink: ఎంట్రీకి ముందే షాకుల మీద షాకులు..

మరిన్ని వార్తలు