కోట్లమంది చిరాకు.. డిలీట్‌ ఫేస్‌బుక్‌ ట్రెండ్‌! గ్యాప్‌లో కుమ్మేసిన ట్విటర్‌, టెలిగ్రామ్‌

5 Oct, 2021 10:00 IST|Sakshi

పొద్దున లేచి ఫేస్‌ కడగకుండానే ఫేస్‌బుక్‌, వాటర్‌ తాగకుండానే వాట్సాప్‌ ఉపయోగించడం మనకు బాగా అలవాటైంది. అంతెందుకు సోషల్‌ మీడియాకు కొద్దిసేపు దూరంగా ఉన్నా.. విలవిలలాడిపోతుంటారు కొందరు. అలాంటిది ఒక్కరాత్రిలో ఫేస్‌బుక్‌ అండ్‌ కో సర్వీసులకు విఘాతం కలగడంతో అల్లలాడిపోయారు. డొమైన్‌ నేమ్‌ సిస్టమ్‌(డీఎన్‌ఎస్‌) సమస్య వల్ల బఫరింగ్‌ స్లో అయిపోవడం, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు రిఫ్రెష్‌ కాకపోవడం లాంటి సమస్యలు ఎదురయ్యాయి.  వీటికితోడు వాట్సాప్‌ పూర్తిగా పనిచేయకుండా నిలిచిపోయింది. చివరికి ఫేస్‌బుక్‌ వర్చువల్‌ రియాలిటీ డివిజన్‌ ‘ఒక్యూలస్‌’ కూడా ఆగిపోవడం(డౌన్‌ డిటెక్టర్‌ సైతం ధృవీకరించింది) ఫేస్‌బుక్‌ను ఘోరంగా దెబ్బతీసింది. 

ఇక నిన్న(అక్టోబర్‌ 4, సోమవారం) రాత్రి నుంచి సోషల్‌ మీడియా టాప్‌లో మొదలైన #instagramdown, #facebookdown, #whatsappdown హ్యాష్‌ట్యాగ్‌లు.. సమస్య తీరాక కూడా ఈ ఉదయం నుంచి ట్రెండ్‌ అవుతుండడం చర్చనీయాంశంగా మారింది. ముందెన్నడూ యూజర్లు ఇలాంటి సమస్య ఇంతసేపు ఎదుర్కొనలేదు. దీంతో వాళ్లలో ఫ్రస్టేషన్‌ పీక్స్‌కు చేరింది. వాట్సాప్‌లో అయినవాళ్లతో ఛాటింగ్‌, వీడియో కాల్స్‌కు అవకాశం లేకపోవడంతో ఫేస్‌బుక్‌ అండ్‌ కోను విపరీతంగా తిట్టిపోసుసుకున్నారు.  ఆ కోపంలో #deletefacbook హ్యాష్‌ట్యాగ్‌ను సైతం ట్విటర్‌ తెర మీదకు తెచ్చారు. అయితే ఈ పరిణామాల వల్ల ఫేస్‌బుక్‌ ఎంతగా నష్టపోయిందో..  కొన్ని ఫ్లాట్‌ఫామ్స్‌ విపరీతంగా లాభపడ్డాయి. 

టెలిగ్రామ్‌ టాప్‌ టక్కర్‌
వాట్సాప్‌ చతికిల పడ్డ టైంలో.. యూజర్లు ఇతర మార్గాలను అన్వేషించారు. యూట్యూబ్‌, ఇతరత్ర సైటల్లో ఎక్కువసేపు గడిపారు. అదే టైంలో ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ సర్వీసుల కోసం టెలిగ్రామ్‌, సిగ్నల్‌ లాంటి యాప్‌లను ఉపయోగించారు కోట్ల మంది.  ముఖ్యంగా టెలిగ్రామ్‌ మెసేంజర్‌ యాప్‌ ఈ ఫేస్‌బుక్‌ సర్వీసుల విఘాతం వల్ల బాగా లాభపడింది.  కొత్తగా కోట్ల మంది కొత్త యూజర్లు టెలిగ్రామ్‌కు సైన్‌ అప్‌ అయ్యారు.  చాలామంది సైన్‌ ఇన్‌ ద్వారా ఉపయోగించుకున్నారు.

ఈ క్రమంలో టెలిగ్రామ్‌కు యూజర్లు వెల్లువెత్తడంతో.. సర్వీసులు నెమ్మదించి రిపోర్టులు(ఫిర్యాదులు) కుప్పలుగా వచ్చాయి. అయితే ‘ఫేస్‌బుక్‌ దెబ్బ’ ప్రభావం వల్ల టెలిగ్రామ్‌ ఎంతగా లాభపడిందనే గణాంకాలు వెల్లడి కావాల్సి ఉంది. మరోవైపు ట్విటర్‌కీ కోట్ల మంది క్యూ కట్టారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో యూజర్లు ఎంగేజ్‌ కావడంతో ఫేస్‌బుక్‌ ఎంత నష్టపోయిందో.. అవీ అంతే లాభపడి ఉంటాయని భావిస్తున్నారు. 


ట్విటర్‌కొచ్చిన వాట్సాప్‌
ఫేస్‌బుక్‌ దాని అనుబంధ సర్వీసులు పని చేయకపోవడంతో నిన్న రాత్రంతా విచిత్రమైన పరిణామాలెన్నో చోటు చేసుకున్నాయి. జుకర్‌బర్గ్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ హెడ్‌లు జనాలకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.   వాట్సాప్‌.. మరోదారిలేక ట్విటర్‌కి వచ్చి యూజర్లకు క్షమాపణలు చెప్పింది. నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా సైతం ఈ సమస్యను హిలేరియస్‌ మీమ్‌గా వాడేసుకుంది. ఫేస్‌బుక్‌ సర్వీసులకు విఘాతం కలగడంతో ట్విటర్‌లో నవ్వులు పూయించారు చాలామంది. 

చదవండి: ఫేస్‌బుక్‌ నష్టం.. ఆరు గంటల్లో 50 వేల కోట్లా!

మరిన్ని వార్తలు