Tesla: ఆటోపైలట్‌ యాక్సిడెంట్లు... మొదలైన విచారణ

17 Aug, 2021 12:25 IST|Sakshi

డ్రైవర్‌ లేకుండా కారు తీసుకొస్తామంటూ ఓ వైపు టెస్లా చెబుతుంటే మరోవైపు ఇప్పటికే టెస్లా కార్లలో ఉన్న ఆటోపైలట్‌ పనితీరుపై విచారణ మొదలైంది. ఇప్పటి వరకు టెస్లా కార్ల వల్ల జరిగిన ప్రమాదాలు ఎన్ని, జరిగిన నష్టం ఎంత అనే అంశాలపై పూర్తి నివేదిక సిద్ధం చేస్తున్నారు. 

ఆటోపైలట్‌పై విచారణ
టెస్లా కంపెనీ అధినేత ఎలన్‌మస్క్‌ డ్రైవర్‌ లేకుండా నడిచే కారును తీసుకొస్తామమంటూ తరచుగా ప్రకటనలు గుప్పిస్తున్నాడు. దీంతో డ్రైవర్‌ లెస్‌ కారు, ఆటోపైటల్‌ టెక్నాలజీపై విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ బేస్డ్‌ డ్రైవర్‌ లెస్‌ కారుపై ఎలన్‌మస్క్‌ రోజుకో అప్‌డేట్‌ బయటకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే టెస్లా కార్లలో అందుబాటులో ఉన్న ఆటోపైలట్‌పై అమెరికాకు చెందిన నేషనల్‌ హైవే ట్రాఫిక్‌ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌ విచారణ ప్రారంభించింది. 

ఒకరి మరణం
అమెరికాలో 2014 నుంచి ఇప్పటి వరకు టెస్లా అమ్మకాలు జరిపిన 7.65 లక్షల కార్లకు సంబంధించిన డేటాను క్రోడీకరించారు. దీని కోసం 2018 నుంచి ఇప్పటి వరకు కాలాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఇందులో మాసాచుసెట్స్‌, మియామీ, శాన్‌డియాగోలలో జరిగిన ప్రమాదాల్లో మొత్తం 17 గాయపడగా అందులో ఒకరు మరణించారు. ఇందులో అత్యధిక ప్రమాదాలు రాత్రి వేళలలో జరిగినవే ఉన్నాయి. 

అంచనా వేయడంలో పొరపాటు?
ప్రమాదాలు జరిగినప ప్రదేశాలను పరిశీలించగా ట్రాఫిక్‌ బోర్డులు, హైవే సూచికలతో పాటు కోన్లు తదితర రక్షణ ఏర్పాట్లు సరిగానే ఉన్నట్టు గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన ప్రదేశాల్లో లైట్ల వెలుతురు కూడా ఎక్కువగా ఉండటాన్ని నమోదు చేశారు. ఈ ప్రమాదాలు జరిగిన సమయంలో సగానికిపైగా కార్లు ఆటోపైలట్‌ మోడ్‌లోనే ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్‌ సిగ్నళ్లు, హెచ్చరిక బోర్డులను అంచనా వేయడంలో ఆటోపైటల్‌ వ్యవస్థ వందశాతం సమర్థంగా పని చేయడం లేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కేవలం సహయకారి 
ఆటోపైలట్‌ వ్యవస్థ డ్రైవర్‌కు సహాయకారిగా ఉపయోగపడుతుందే తప్ప పూర్తిగా డ్రైవర్‌ లేకుండా కారును సమర్థంగా నడపలేదని తాము ముందు నుంచే చెబుతున్నామంటోంది టెస్లా. ఎదైనా ప్రమాదాలను, హెచ్చరికలను గుర్తించినప్పుడు డ్రైవర్‌ను అలెర్ట్‌ చేస్తుందే తప్ప స్వంతగా నిర్ణయాలు తీసుకోదని వెల్లడించింది. అదేవిధంగా డ్రైవర్‌ లెస్‌ కార్ల తయారీ అనేది ఇంకా కాన్సెప్టు దశలోనే ఉందంటోంది టెస్లా.
 

మరిన్ని వార్తలు