Elon Musk: మొండి ఘటం.. టెస్లాకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

6 Nov, 2021 18:35 IST|Sakshi

ఎలన్‌ మస్క్‌ ఏదీ చేసినా సంచలనమే. ప్రత్యర్థులకు అందనంత వేగంతో నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట. భవిష్యత్తును అంచనా వేయడంలో మొనగాడు. ఏదైనా సాధించాలని నిర్ణయించుకుంటే పట్టుదలతో ప్రయత్నిస్తారు. టెస్లా కంపెనీకి ఆ పేరు రావడం వెనుక కూడా ఆ పట్టుదలే కారణం. 

ప్రపంచంలోనే అత్యంత సంపన్న కార్పొరేట్‌ కంపెనీల జాబితాలోకి రాకెట్ వేగంతో దూసుకువచ్చిన కంపెనీ టెస్లా. అనతి కాలంలోనే 1.22 ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ క్యాపిటల్‌ కలిగిన సంస్థగా ఎదిగింది. అయితే ఈ కంపెనీకి టెస్లా అనే పేరు పెట్టేందుకు ఎలన్‌ మస్క్‌ ప్రత్యేక వ్యూహాలనే అమలు చేశాడు.

‘టెస్లా’ ఆ స్టోరీనే వేరు
టెస్లా మోటార్స్‌ కంపెనినీ 2003లో మార్టిన్‌ ఎబర్‌ హార్డ్‌, మార్క్‌ టార్పెనింగ్‌లు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2004లో ఎలన్‌మస్క్‌ అధికారికంగా దీనికి సీఈవో అయ్యాడు. ఆ తర్వాత మరో ఇద్దరిని కలుపుకుని మొత్తం ఐదుగురు కో ఫౌండర్లుగా వ్యవహరించారు. ఆ తర్వాత ఎలన్‌మస్క్‌ ముందు చూపుతో కంపెనీ అంచెలంచెలుగా ఎదిగి అనతి కాలంలోనే ట్రిలియన్‌ మార్క్‌ని దాటేసింది.

టెస్లా కావాల్సిందే
ఎలక్ట్రిసిటీ బేస్డ్‌ టెక్నాలజీ ఆధారంగా కంపెనీ ప్రారంభించాలని ఎలన్‌ మస్క్‌ ఇతర బృందం సన్నాహాలు చేస్తున్న సమయంలో అప్పటికే టెస్లా పేరుతో మరో కంపెనీ రిజిస్టరై ఉంది. కాలిఫోర్నియాకి చెందిన సాక్రమెంటో సంస్థ దగ్గర టెస్లా పేరు ఉంది. విషయం తెలుసుకున్న ఎలన్‌ మస్క్‌ ఎలాగైనా ఆ పేరు దక్కించుకోవాలని నిర్ణయించుకున్నాడు.

75,000 డాలర్లకు
తన కంపెనీలో పని చేస్తు‍న్న ఉద్యోగుల్లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ బాగా ఉండి అసలు కోపం అంటే ఏంటో తెలియని వాడిగా పేరున్న ఉద్యోగిని ఎంచుకున్నాడు. వెంటనే టెస్లా పేరు ఎలాగైనా కావాలని, ఎంత ఖర్చైనా సరే సాక్రమెంటో నుంచి ‘టెస్లా’ హక్కులు తేవాలంటూ కోరాడు. ఈ ఆపరేషన్‌ సక్సెస్‌ చేసేందుకు వీలుగా సాక్రమెంటో ఓనర్‌ ఇంటి ముందే ఎలన్‌ మస్క్‌ ఉద్యోగి మకాం వేశాడు. చర్చల మీద చర్చలు జరిగిన తర్వాత చివరకు 75 వేల డాలర్లకు ఆ పేరును సాధించారు. ఆ తర్వాత టెస్లా ఎంతో పెద్ద కంపెనీగా ఎదిగింది. ఈ విషయాన్ని ఇటీవల ఎలన్‌మస్క్‌ స్వయంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో టెస్లా సిలికాన్‌ వ్యాలీ క్లబ్‌ పోస్ట్‌ చేసింది.


టెస్లా కాకుంటే ఫారడే
ఒకవేళ టెస్లా పేరు దొరక్క పోయి ఉంటే ఏం పేరు పెట్టేవారంటూ ప్రశ్నించగా .. ఎలన్‌ మస్క్‌ ఫారడే అనే పేరు పరిశీలనలో ఉందంటూ చెప్పుకొచ్చారు. దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడం, తీసుకున్న నిర్ణయాలను వేగంగా అమలు చేయడంలో ఎలన్‌ మస్క్‌ స్టైలే వేరు. ఈ తీరు కారణంగా ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చినా.. ఆయన సక్సెస్‌లో ఈ దూకుడుది ప్రత్యేక స్థానం ఉంది. 

చదవండి:బిల్‌గేట్స్, బఫెట్‌ ఇద్దరికంటే ఎక్కువ.. మిగిలింది మార్స్‌కి పోవడమే!

మరిన్ని వార్తలు