Tesla Driverless Car: తోక ముడిచిన ఎలన్‌ మస్క్‌

6 Jul, 2021 12:20 IST|Sakshi

ఎలన్‌మస్క్‌ నేతృత్వంలో నడుస్తున్న టెస్లా రూపొందించిన ఎస్‌ ప్లెయిడ్‌ ఎలక్ట్రిక్‌ కారు ఇప్పుడు అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ ఏడాదిలోనే డ్రైవర్‌ లెస్‌ కారు కూడా తీసుకొస్తానంటూ సీఈవో ఎలన్‌మస్క్‌ ప్రకటించారు. మరీ ఆటో పైలెట్‌ కారు ప్రయోగాలు ఎక్కడి వరకు వచ్చాయి. ఎలన్‌ మస్క్‌ కల ఎప్పుడు సాకారం కావొచ్చు ?

కాలిఫోర్నియా : ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌కి కొత్త అర్థం చెప్పిన వారిలో ఎలన్‌ మస్క్‌ ముందు వరుసలో ఉంటారు. పేపాల్‌ సీఈవోగా, స్పేస్‌ ఎక్స్‌  అధినేతగా, టెస్లా సీఈవోగా.. ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా ఎలన్‌ మస్క్‌ ఎదిగాడు. ఆటోపైలట్‌ మోడ్‌ లేదా సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారుకు సంబంధించి ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌పై చాన్నాళ్లుగా ఆయన వర్క్‌ చేస్తున్నారు.

ఈ ఏడాదే
ఎస్‌ ప్లెయిడ్‌ ప్రారంభానికి ముందు 2021 జనవరిలో ఎలన్‌మస్క్‌ మాట్లాడుతూ.. ఈ ఏడాదిలోనే డ్రైవరు లేకుండా నడిచే కారు అందుబాటులోకి వస్తుందంటూ సంచలన ప్రకటన చేశారు. దీంతో  జూన్‌లో విడుదలైన ఎస్‌ ప్లెయిడ్‌లో డ్రైవర్‌ లెస్‌ ఆప్షన్‌ కూడా ఉంటుందని అంతా భావించారు. కానీ ఆ ఫీచర్‌ని ఎస్‌ ప్లెయిడ్‌లో టెస్లా అందివ్వలేదు.

చాలా కష్టం
ఆటో పైలెట్‌ కారును ఇప్పుడప్పుడే మార్కెట్‌లోకి తీసుకురావడం కష్టమని ఎలన్‌ మస్క్‌ తాజాగా అంగీకరించారు. ‘ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ టెక్నాలజీ ఎంతో జటిలమైనది,  దీన్ని నిజం చేయాలంటే, వాస్తవిక ప్రపంచానికి తగ్గటుగా ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ని రూపొందించాలి. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని, ఈ విషయం నేను ఇంతకు ముందు ఊహించలేదు. వాస్తవితకకు ఉన్నంత స్వేచ్ఛ మరి దేనికి లేదు’ అంటూ ఇటీవల ఎలన్‌ మస్క్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

లెవల్‌ 2
సెల్ఫ్‌ డ్రైవింగ్‌కి సంబంధించి గతంలో తాము చేసిన ప్రకటనలు అన్నీ వాస్తవికంగా అమల్లోకి తేవడానికి అనుకూలంగా లేవంటూ టెస్లా తెలిపింది. మరోవైపు ఆటో పైలెట్‌ ఇంకా లెవల్‌ 2లో ఉన్నట్టుగా కూడా చెప్పింది. లెవల్‌ 2 అంటే ఆటో పైలెట్‌ ఆప్సన్‌ ఉన్నప్పటికీ కారులో డ్రైవర్‌ ఉండాల్సిందే. కేవలం డ్రైవర్‌ యొక్క భారాన్ని తగ్గిస్తుందే తప్ప పూర్తిగా డ్రైవింగ్‌ చేయలేదని అర్థం.

మరిన్ని వార్తలు