కేంద్రం టఫ్‌ కండిషన్స్‌.. ఏకంగా ప్రధానినే బతిమాలుతున్న ఎలన్‌ మస్క్‌!

21 Oct, 2021 08:25 IST|Sakshi
ప్రధాని మోదీతో ఎలన్‌ మస్క్‌ (పాత చిత్రం)

ఆటోమొబైల్‌ దిగ్గజ కంపెనీ టెస్లా.. భారత్‌లో ఎంట్రీకి శతవిధాల ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అనుమతులు దొరికిన వెంటనే.. ఈ ఏడాదిలోనే కార్లను భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లను దించి సొంత షోరూమ్‌లు, ఆన్‌లైన్‌ ద్వారా అమ్మకాలు చేపట్టాలని ప్రణాళిక గీసుకుంది. అయితే.. ఒకేఒక్క కారణంతో టెస్లా తటపటాయిస్తోంది. ప్రపంచంలో ఏ దేశంలో లేనంతంగా మన దేశంలోనే దిగుమతి సుంకం భారీగా ఉంది. ఈ తరుణంలో ఈ విషయంలో కొంచెం తగ్గితే మంచిదని భారత్‌ను బతిమాలుతున్నాడు టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌. 


మరోవైపు భారత్‌ మాత్రం ఈ విషయంలో తగ్గడం లేదు. టెస్లా డిమాండ్‌కు ఓకే చెబితే.. మిగతా కంపెనీల నుంచి, ముఖ్యంగా స్థానిక కంపెనీల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతాయేమోనన్న ఆలోచనలో ఉంది. ఈ తరుణంలో దిగుమతి సుంకం తగ్గించడం మాట అటుంచి..  ముందు భారత్‌లో టెస్లా భవిష్యత్‌ ప్రణాళిక బ్లూప్రింట్‌(ఇంపోర్టెడ్‌ కార్ల అమ్మకం(చైనా నుంచి కాకుండా అనే కండిషన్‌), మేక్‌ ఇన్‌ ఇండియా(మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి) ఎక్కడ మొదలుపెడతారు.. తదితర వివరాలు) సమర్పించాలని కోరింది. ఈ పరిణామాల నడుమ..  టెస్లా కంపెనీ నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయంలోనే సంప్రదింపులు జరిపిన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 

రాయిటర్స్‌ తాజా కథనం ప్రకారం..  భారత్‌లో టెస్లా వ్యవహారాలు చూసుకోబోయే మనుజ్‌ ఖురానా, ఇతర టెస్లా ఎగ్జిక్యూటివ్స్‌ కిందటి నెలలో పీఎం కార్యాలయంలో సంబంధిత అధికారులతో చర్చలు నిర్వహించారు. అంతేకాదు ఎలన్‌ మస్క్‌ స్వయంగా ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. సుంకాల తగ్గింపు వల్ల తమ కార్యకలాపాలను సక్రమంగా నిర్వహించుకునే వీలు కలుగుతుందని, భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులకు తాము సిద్ధంగా ఉన్నామని మస్క్‌, ప్రధానిని కోరినట్లు సమాచారం. అయితే టెస్లా విజ్ఞప్తులకు భారత్‌ నుంచి ఎలాంటి బదులు వచ్చిందనేది తెలియాల్సి ఉంది!.

ఒకవేళ టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలపై ఇంపోర్ట్‌ ట్యాక్స్‌ గనుక తగ్గించాలంటే.. ముందు భారత్‌లో కార్ల తయారీ ఒప్పందం మీద సంతకం చేయాలని ఆ సమావేశంలో సీనియర్‌ అధికారులు కోరినట్లు తెలుస్తోంది.  మరోవైపు టెస్లా ఒక్కటే కాదని, చాలా కంపెనీలు ఈవీల తయారీకి సిద్ధంగా ఉన్నాయని, కాబట్టి ఈ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. దీంతో మరో దఫా చర్చలు నిర్వహించాలని నిర్ణయించారు.

ఇక భారత్‌లో విదేశాల నుంచి దిగుమతి చేస్తున్న వాహనాలపై వాటి ధర 40వేల డాలర్లులోపు ఉంటే 60 శాతం, 40వేల డాలర్ల కంటే ఎక్కువగా ఉంటే 100 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తున్నారు. సో.. ఈ లెక్కన టెస్లా గనుక విక్రయాలు మొదలుపెడితే ధరలు భారీగా పెంచాల్సి ఉంటుంది. అప్పుడు బయ్యర్స్‌ ముందుకు రావడం కొంచెం కష్టం. అందుకే  ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతి సుంకాన్ని తగ్గించాలని టెస్లా కోరుతోందని టెస్లా కథనం.

చదవండి: ఎలోన్ మస్క్ ఎంట్రీతో మెరుపు వేగంతో పెరిగిన ఇళ్ల ధరలు

ఇదీ చదవండి: మస్క్ మావా.. జర బెంజ్‌ను చూసి నేర్చుకో!

మరిన్ని వార్తలు