Elon Musk: ‘డ్రాగన్‌ ఈజ్‌ ది బెస్ట్‌’.. ఇండైరెక్ట్‌గా భారత్‌పైనే సెటైర్లు?

27 Sep, 2021 10:56 IST|Sakshi

భారత్‌లో ఎంట్రీకి దారులు ఇరుక్కుగా మారుతున్న క్రమంలో.. టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ అసహనానికి లోనవుతున్నాడు. ఈ తరుణంలో ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి.  భారత్‌పై కోపాన్ని చల్లార్చుకునేందుకు చైనాను ఆకాశానికెత్తేస్తూ పొగడ్తలు గుప్పిస్తున్నాడంట మస్క్‌.  గత పదిరోజుల్లో ఈ తరహా వ్యాఖ్యలు రెండుసార్లు చేయడం ప్రత్యేకతను సంతరించుకుంది. 


చైనాకు చెందిన సైబర్‌స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ తాజాగా నిర్వహించిన వరల్డ్‌ ఇంటర్నెట్‌ కాన్ఫరెన్స్‌లో టెస్లా చీఫ్‌ ఎలన్‌ మస్క్‌ ఇచ్చిన వాయిస్‌ సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా మస్క్‌ రాబోయే రోజుల్లో టెస్లా కార్యకలాపాలను చైనాలో మరింత విస్తరించనున్నట్లు ప్రకటించాడు. ‘‘ఓపెన్‌గా చెప్పాలంటే చైనా వనరుల కోసం విపరీతంగా ఖర్చుపెడుతోంది. డిజిటల్‌ టెక్నాలజీని వివిధ పరిశ్రమల్లో ఉపయోగించుకుంటోంది. అందులో ఆటోమొబైల్‌కు అగ్రతాంబూలం ఇవ్వడం వల్ల చైనా డిజిటలైజేషన్‌లో రారాజుగా వెలుగొందుతోంది. ఈ విషయంలో ఆసియాలో పెద్దది, టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నామని చెప్తున్న ఓ పెద్ద దేశం రేసులో వెనుకబడే ఉండడం విశేషం’’ అని మస్క్‌ వ్యాఖ్యానించాడు. 

క్లిక్‌ చేయండి: టెస్లా గిగా ఫ్యాక్టరీ.. మాట మార్చిన మస్క్

 

భారత్‌ను ఉద్దేశించేనా?
ఎలన్‌ మస్క్‌ చేసిన ఈ వ్యాఖ్యలు పరోక్షంగా భారత్‌ను ఉద్దేశించి చేసినవేనని మేధావులు విశ్లేషిస్తున్నారు. భారత్‌లో టెస్లా ఎంట్రీ కోసం ఎలన్‌ మస్క్‌ విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నాడు.  కానీ, ఆ ప్రయత్నాలు ఎటూ తేలడం లేదు. ఈ క్రమంలోనే చైనాకు మరిన్ని పెట్టుబడుల్ని తరలించడం ద్వారా భారత్‌ను రెచ్చగొట్టాలని మస్క్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇక భారత్‌లో టెస్లా ఎంట్రీకి..  సుంకాల తగ్గింపు విజ్ఞప్తితో మొదలైన వ్యవహారం పలు దఫాల చర్చలతో నడుస్తూ వస్తోంది. సొంత షోరూమ్‌లతో పాటు ఆన్‌లైన్‌లోనూ అమ్మకాలు కొనసాగించాలని,  నాలుగు మోడల్స్‌ కార్లతో దాదాపుగా భారత్‌లో ఎంట్రీ కూడా ఖరారైందని ప్రకటనలు ఇస్తూ వచ్చారు.  ఈలోపు కేంద్రం మరో ట్విస్ట్‌ ఇచ్చింది.  దిగుమతి కంటే ముందు ‘మేక్‌ ఇన్‌ ఇండియా’పై దృష్టిపెట్టాలని, ఈ విషయమై రాబోయే రోజుల్లో టెస్లా భారత్‌లో నిర్మించబోయే ఫ్యాక్టరీలపై స్పష్టత ఇవ్వాలని కేంద్రం టెస్లాను కోరింది. దీంతో టెస్లా  ఎంట్రీ మళ్లీ వెనక్కు వెళ్లినట్లు తెలుస్తోంది.

ఫేవరెట్‌ డ్రాగన్‌
ఎలన్‌ మస్క్‌ గత కొంతకాలంగా చైనాను మామూలుగా పొగడట్లేదు.  2019లో షాంఘైలో గిగా ఫ్యాక్టరీ(3) ప్రారంభించిన టెస్లా.. కార్లను ఉత్పత్తి చేసినట్లే చేసి ప్రైవసీ సంబంధిత కారణాలతో వాటిలో బయటకు తీసుకురాలేకపోయింది. ఈ నేపథ్యంలో చైనాలోనే టెస్లా డాటా సెంటర్‌ను నెలకొల్పి.. లోకలైజేషన్‌ ద్వారా ఉత్పత్తి మొదలుపెట్టింది టెస్లా. అయితే ఆటోమొబైల్‌ మార్కెట్‌లో భారీ బిజినెస్‌ చేసే భారత్‌లో మాత్రం లోకలైజేషన్‌ గురించి స్పష్టత ఇవ్వలేకపోతున్నాడు.  ఇక ఈ నెల మొదట్లో జరిగిన వర్చువల్‌ కాన్ఫరెన్స్‌లోనూ మస్క్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చైనీస్‌ ఆటోమేకర్స్‌పై తనకు ప్రత్యేక గౌరవం ఉందని, ఉత్తమమైన సాఫ్ట్‌వేర్‌లతో ఆటోమొబైల్‌ ఇండస్ట్రీని అత్యుత్తమంగా తీర్చిదిద్దుతున్నారని పొగడ్తలు గుప్పించాడు కూడా.


చదవండి: అప్పుడే అయిపోలేదు.. ఇప్పుడే మొదలైంది

మరిన్ని వార్తలు