ఇండియా దగ్గర పప్పులుడకలేదు.. ఇప్పుడు ఇండోనేషియా అంట?

21 Jun, 2022 18:10 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ కార్లలో ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న టెస్లా కంపెనీ ఇండియా విషయంలో మైండ్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసింది. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే ఇతర దేశాలకు తరలిపోతామనేట్టుగా ఫీలర్లు వదులుతోంది. పరోక్షంగా ఇండియాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు టెస్లా కంపెనీ అధినేత ఎలాన్‌ మస్క్‌.

అమెరికాకు చెందిన టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్‌ కార్లకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ ఉంది. ఈ కార్ల తయారీ కోసం తొలిసారిగా గిగాఫ్యాక్టరీ కాన్సెప్టుతో భారీ తయారీ కర్మాగారాలను ఎలాన్‌ మస్క్‌ నిర్మించాడు. అమెరికా వెలుపల  జర్మనీ, చైనాలో రెండు గిగాఫ్యాక్టరీలను నెలకొల్పాడు. చైనాలో తయారైన ఎలక్ట్రిక్‌ కార్లను ఇండియాలో విక్రయించేలా ప్లాన్‌ రెడీ చేసుకున్నాడు. ఎలక్ట్రిక్‌ కార్ల నుంచి కాలుష్యం రాదు కాబట్టి తమ కార్లను ప్రత్యేకంగా పరిగణిస్తూ పన్ను రాయితీలు ఇవ్వాలంటూ భారత ప్రభుత్వాన్ని కోరాడు.

షరతులు వర్తిస్తాయి
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లకు భారత ప్రభుత్వం భారీ ఎత్తున పన్ను విధిస్తోంది. ముఖ్యంగా రూ.60 లక్షలకు పైగా విలువ ఉండే కార్లకు వంద శాతం పన్ను విధిస్తోంది. ఎలాన్‌ మస్క్‌ కోరిక మేరకు టెస్లాకు పన్ను నుంచి మినహాయింపు ఇస్తే.. స్థానికంగా ఉన్న ఇతర ఆటోమొబైల్‌ కంపెనీల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో ఎలాన్‌ మస్క్‌ డిమాండ్లు నెరవేర్చాలంటే కొన్ని షరతులు భారత ప్రభుత్వం విధించింది. ఇండియాలోనే కార్ల తయారీ పరిశ్రమ నెలకొల్పితే పన​‍్ను రాయితీల విషయం ఆలోచిస్తామంటూ తేల్చి చెప్పంది.

రాజీ కుదరలేదు
పన్నుల రాయితీలు, పరిశ్రమ స్థాపన విషయంలో ఇరు వర్గాల మధ్యన దాదాపు ఏడాది కాలంగా పలు మార్లు అంతర్గత చర్చలు జరిగినా సానుకూల ఫలితం రాలేదు. దీంతో టెస్లా ఇండియా హెడ్‌గా ఉన్న మనూజ్‌ ఖురానా ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇండియాలో టెస్లా కథ ముగిసినట్టే అనే భావన నెలకొంది.

ఇండోనేషియా వంకతో
ప్రపంచంలోనే రెండో అతి పెద్ద మార్కెట్‌ అయిన ఇండియాను వదులుకోవడానికి ఎలాన్‌ మస్క​ సిద్ధంగా ఉన్నట్టుగా కనిపించడం లేదు. అందుకే ఈసారి ఇండియాపై పరోక్షంగా ఒత్తిడి తెచ్చే చర్యలకు పూనుకున్నాడు. అందులో భాగంగా టెస్లా పరిశ్రమను తమ దేశంలో నెలకొల్పాలని ఇండోనేషియా ప్రభుత్వం కోరుతున్నట్టుగా టెస్లా ప్రెసిడెంట్‌ జోకో విడోడో చేత ప్రకటన చేయించారు. తమతో పాటు ఫోర్డ్‌ ఇతర కంపెనీలను కూడా ఇండోనేషియా కోరినట్టు వార్తలు ప్రచారంలోకి తెచ్చారు.  

ఒత్తిడి తెచ్చే ప్రయత్నం
ఇండియాలో వ్యాపారం లాభసాటిగా లేదంటూ గతేడాది ఫోర్డ్‌ ప్రకటించింది. ఇండియా నుంచి వెనక్కి వెళ్తున్నట్టుగా చెబుతూ ఇక్కడ కార్ల అమ్మకాలను ఆపేసింది. ఆ సంస్థకు ఉన్న మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్లను అమ్మేందుకు సిద్ధపడింది. ఇండియాలో ఫోర్డ్‌ ప్రస్థానానికి టెస్లా వ్యవహరాలను ముడిపెడుతూ ఇండియాకు ప్రత్యామ్నాయంగా ఇండోనేషియా ఉందనేట్టుగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల్లో ఎలాన్‌ మస్క్‌ ఉన్నారు. అయితే తాజా పరిణామాలపై భారత ప్రభుత్వం తరఫున ఎటువంటి స్పందన రాలేదు.  

చదవండి:  వెల్‌కమ్‌ టూ ఎలాన్‌ మస్క్‌.. షరతులు వర్తిస్తాయి..


 

మరిన్ని వార్తలు