టెస్లా వెహికిల్‌: బెట్టు వీడి మెట్టు దిగొచ్చిన కేంద్రం!

13 Aug, 2021 14:29 IST|Sakshi

Tesla EV In India: భారత్‌లో తమ బ్రాండ్‌ ఎలక్ట్రిక్ వాహనాలను లాంఛ్‌ చేయాలన్న టెస్లా ప్రయత్నాలకు లైన్‌ క్లియర్‌ అవుతోందా?. దిగుమతి సుంకాలపై తగ్గే ప్రసక్తే లేదన్న కేంద్ర ప్రభుత్వం.. నెమ్మదిగా దిగొస్తోందా? అంటే అవుననే సంకేతాలు అందుతున్నాయి. 

తమ ఈవీలను భారత్‌లోకి తక్కువ దిగుమతి సుంకాలతో అనుమతిస్తే.. ఆపై తయారీ యూనిట్లపై దృష్టిపెడతామని అమెరికన్‌ వెహికిల్స్‌ కంపెనీ టెస్లా భారత ప్రభుత్వానికి చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో దిగుమతి సుంకాన్ని ఎట్టి పరిస్థితుల్లో తగ్గించబోమని భారత్‌ కరాకండిగా చెప్పేసింది. అయినప్పటికీ ఆగష్టు మొదటి వారంలో టెస్లా.. భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రం కొంచెం తగ్గినట్లు సమాచారం. టెస్లాకు సంబంధించి స్థానిక యూనిట్‌ల సేకరణ, తయారీ యూనిట్‌ల ప్రణాళికను పూర్తిస్థాయి వివరాలను తమకు అందిస్తే దిగుమతి సుంకం తగ్గింపుపై ఆలోచన చేస్తామని టెస్లాకు కేంద్రం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 

ఈ మేరకు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ టెస్లాతో జరిపిన సంప్రదింపులు.. కీలక ప్రతిపాదన గురించి ఓ ప్రముఖ బిజినెస్‌ బ్లాగ్‌ కథనం ప్రచురించింది. ఇదిలా ఉంటే భారత్‌లో ఈవీ అమ్మకాల ప్రయత్నంలో భాగంగా.. టెస్లా కంపెనీ ఈ ఏడాది జనవరిలో బెంగళూరులో రీజినల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. కానీ, అధిక దిగుమతి సుంకాలు తమ ప్రవేశానికి ఆటంకంగా పరిణమించాయని ఎలన్‌ మస్క్‌ ఆమధ్య ఓ ట్వీట్‌ చేశాడు. ఆపై జులై చివర్లో కేంద్రానికి ఒక విజ్ఞప్తి లేఖ కూడా రాశాడు. కానీ, కేంద్రం తగ్గలేదు.

చదవండి: ఎలన్‌ మస్క్‌.. ఈసారి ఆకాశమే హద్దు!

కానీ, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు భారత్‌లో టెస్లా భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించి పూర్థి స్థాయి వివరాలు అందిస్తేనే.. కంప్లీట్‌ బిల్డ్‌ యూనిట్‌ కార్‌ మోడల్స్‌పై దిగుమతి సుంకంపై  పునరాలోచన చేస్తామని కేంద్రం చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుమారు 30 లక్షల విలువ కంటే వాహనాలపై 60 శాతం, అంతకంటే ఎక్కువ ఉంటే వంద శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తోంది భారత ప్రభుత్వం. దీంతో రీజనబుల్‌ ధరలతో టెస్లా భారత్‌లో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక టెస్లా మెయిన్‌ పోర్టల్ ప్రకారం మోడల్ 3 స్టాండర్డ్ రేంజ్ ప్లస్ మోడల్ ధర 40000 డాలర్ల కంటే తక్కువగా ఉంది.

మరిన్ని వార్తలు