Tesla: టెస్లా కార్లలో ‘కలకలం..!’ పాత దానినే వాడండి..!

25 Oct, 2021 14:57 IST|Sakshi

అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిగ్గజం టెస్లా కీలక నిర్ణయం తీసుకుంది. టెస్లా కార్ల సెల్ఫ్‌ డ్రైవింగ్‌ బీటా వెర్షన్‌లో సమస్యలు ఉన్నట్లు కంపెనీ గుర్తించింది. వెంటనే కార్ల సెల్ఫ్‌ డ్రైవింగ్‌ సాఫ్ట్‌వేర్‌లో  భాగంగా కొత్త వెర్షన్‌కు బదులుగా పాత వెర్షన్‌ వాడాలని టెస్లా తన వాహనదారులకు విన్నవించింది. స్వీయ-డ్రైవింగ్ (ఎఫ్‌ఎస్‌డీ) బీటా సాఫ్ట్‌వేర్ తాజా వెర్షన్‌ను అక్టోబర్ 24న విడుదల చేసింది.  విడుదలైన ఒక రోజులోనే...కొల్లిజన్‌ వార్నింగ్స్‌ విషయంలో సమస్యలు ఉన్నట్టు వినియోగదారులు టెస్లాకు రిపోర్ట్‌ చేసినట్లు రాయిటర్స్‌ పేర్కొంది. తాజాగా రిలీజ్‌ చేసిన ఎఫ్ఎ‌స్‌డీ 10.3 బీటా వెర్షన్‌ సాఫ్ట్‌వేర్‌లో సమస్యలు ఉండడంతో..10.2 ఎఫ్‌ఎస్‌డీ సాఫ్ట్‌వేర్‌ వెర్షన్‌ను వాడాలని కంపెనీ వినియోగదారులకు సూచించింది.
చదవండి:  ఎలక్ట్రిక్‌ వాహన కొనుగోలుదారులకు భారీ షాకిచ్చిన టెస్లా..!

కొత్త సాఫ్ట్‌వేర్‌లో ఇదే సమస్య..! 
బీటా వినియోగదారుల వీడియో పోస్టింగ్‌ల ప్రకారం, టెస్లా వాహనాలు తాజా 10.3 సాఫ్ట్‌వేర్‌తో తక్షణ ప్రమాదం లేనప్పుడు ఫార్వర్డ్ కొలిషన్ హెచ్చరికలను పదేపదే అందిస్తున్నట్లు గుర్తించారు.  కొన్ని వాహనాలు కూడా కారణం లేకుండా స్వయంచాలకంగా బ్రేకులు వేసినట్లు వినియోగదారులు సోషల్ మీడియా పోస్ట్‌లలో తెలిపారు. 

స్పందించిన ఎలన్‌ మస్క్‌..!
కంపెనీ రిలీజ్‌ చేసిన ఎఫ్‌ఎస్‌డీ బీటా వెర్షన్‌లో సమస్యలు ఉన్నట్లు టెస్లా క్వాలిటీ కంట్రోల్‌ టీమ్‌ గుర్తించిందని వాటికి వెంటనే పరిష్కారం చూపుతామని టెస్లా అధినేత ఎలన్‌మస్క్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. బీటా వెర్షన్‌ ఏవిధంగా పనిచేస్తుందనే విషయాన్ని ఓక మోడల్‌పై టెస్ట్‌ చేస్తే అనుకున్నంతా ఫలితాలు రావు. దీంతో పలు వినియోగదారులకు అధిక సంఖ్యలో బీటా వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఎలన్‌ వెల్లడించారు. 

కొంత మంది వినియోగదారుల కోసం బీటా వెర్షన్‌ టెస్టింగ్‌లో భాగంగా కొత్త డ్రైవింగ్ అసిస్ట్ సిస్టమ్‌ను విడుదల చేస్తున్నట్లు అక్టోబర్‌ 22 న పేర్కొంది.ఈ సాఫ్ట్‌వేర్‌లో అనేక ఇంప్రూవ్డ్‌ ఫీచర్స్‌ ఉన్నట్లు వినియోగదారులకు కంపెనీ పేర్కొంది. ఇదిలా ఉండగా..ఈ ఏడాది ఆగస్టులో టెస్లా ఆటోపైలట్‌ సిస్టమ్‌తో జరిగిన ప్రమాదాలపై నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA)  విచారణను ప్రారంభించింది.
చదవండి: ఇండియా పాక్‌ మ్యాచ్‌.. అక్కడ కూడా ఫ్లాప్‌.. కానీ రూ.300 కోట్లు వెనక్కి

>
మరిన్ని వార్తలు