టెస్లా కార్లలో ‘కలకలం..!’

31 Dec, 2021 15:08 IST|Sakshi

అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిగ్గజం టెస్లా కీలక నిర్ణయం తీసుకుంది. టెస్లా కార్లలోని రియర్ వ్యూ కెమెరా, ట్రంక్ లో సమస్యలు ఉన్నట్లు కంపెనీ గుర్తించడంతో ఈ సమస్యను తనిఖీ చేయడానికి టెస్లా తన 4,75,000 ఎలక్ట్రిక్ వాహనదారులకు రీకాల్ ఆర్డర్లను జారీ చేసింది. ఈ సమస్య వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్లు భావించి రీకాల్ చేసినట్లు పేర్కొంది. రీకాల్ చేయబడ్డ యూనిట్‌లు టెస్లా మోడల్ 3, మోడల్ ఎస్ ఎలక్ట్రిక్ వాహనాలు. టెస్లా రీకాల్ ఆర్డర్‌ను యుఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌హెచ్‌టిఎస్‌ఎ) ధృవీకరించింది. 

2014 నుంచి 2021 మధ్య కాలంలో తయారు చేసిన మోడల్ 3, మోడల్ ఎస్ ఎలక్ట్రిక్ వాహనలను సంస్థ రీకాల్ చేసింది. ఈ మోడల్ 3 ఈవీలలో వెనుక ట్రంక్ తెరిచినప్పుడు, మూసివేసినప్పుడు వెనుక కెమెరా దెబ్బతినే అవకాశం ఉన్నట్లు రాయిటర్స్ నివేదించింది. కొన్ని టెస్లా కార్లలోని ఫ్రంట్ ట్రంక్ లో ఉన్న లోపం వల్ల భారీ ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉన్నట్లు సంస్థ గుర్తించింది. కారు ప్రయాణిస్తున్న సమయంలో ముందు ఉన్న ట్రంక్ ఒకేసారి ఆటోమెటిక్‌గా  తెరుచుకోవడంతో ముందు వెళ్తున్న వాహనాలు, రోడ్డు కనిపించకపోవడంతో వాహనదారులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఇప్పటివరకు ప్రమాదాలు జరిగినట్లు తమ దృష్టికి రాలేదని టెస్లా పేర్కొంది. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా 4,75,000 ఈవీలను రీకాల్ చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. 

(చదవండి: చేనేతకు ఊరట.. జీఎస్‌టీ పెంపు నిర్ణయం వాయిదా)

మరిన్ని వార్తలు