Tesla S Plaid : క్షణాల్లో బూడిదైన టెస్లా కారు! విలువ ఎంతంటే..

2 Jul, 2021 12:35 IST|Sakshi

పెన్సిల్వేనియా: ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌లో సంచలనంలా దూసుకు వచ్చిన టెస్లా ఎస్‌ప్లెయిడ్‌ కారు కస్టమర్లకు షాక్‌ ఇచ్చింది. ఎవ్వరూ ఊహించిన విధంగా మంటల్లో చిక్కుకుని బూడిదైంది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. టెస్లా కారు భద్రతపై అనుమాన మేఘాలు రేకెత్తించింది. 

క్షణాల్లో బుగ్గి
అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్త మార్క్‌ గెరాగోస్‌  ఇటీవల ఎస్‌ ప్లెయిడ్‌ ​కారుని 1,29,900 డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశాడు. జులై 1న ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు కారు బయటకు తీయగా  10 మీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. వెంటనే మార్క్‌ దిగేందుకు ప్రయత్నించగా... ఎలక్ట్రానిక్‌ డోర్‌ సిస్టమ్‌ తెరుచుకోలేదు... చివరకు మార్క్‌ ప్రయత్నాలు సఫలమై ... కారు డోర్‌ ఓపెన్‌ చేసి ప్రమాదం నుంచి బయట పడ్డారు. ఈ ప్రమాద వివరాలను మార్క్‌ తరఫున న్యాయవాది మీడియాకు వెల్లడించారు.  ‘ఇదోక భయంకరమైన అనుభవమని, ప్రమాదంపై విచారణ జరుగుతోంది’ అని బాధితుడు మార్క్‌ వెల్లడించారు. 

షాక్‌లో టెస్లా
ఎస్‌ ప్లెయిడ్‌ కారు మంట్లలో కాలిపోవడంపై టెస్లా అభిప్రాయం కోరేందుకు మీడియా ప్రయత్నించగా  ఆ కంపెనీ ప్రతినిధులెవరు అధికారికంగా స్పందించలేదు. ఇటీవల ఎస్‌ప్లెయిడ్‌ పేరుతో టెస్లా నుంచి ఈవీ వెహికల్‌ మార్కెట్‌లోకి వచ్చింది. లాంఛింగ్‌ సందర్భంగా టెస్లా ఓనర్‌ ఎలన్‌మస్క్‌ మాట్లాడుతూ ‘ వేగంలో ఫెరారీ, భద్రతలో వోల్వో కంటే ఎస్‌ ప్లెయిడ్‌ ఉత్తమంగా ఉంటుంది’ అని ప్రకటించారు. నెల రోజులు గడవక ముందే ఎస్‌ ప్లెయిడ్‌ కారు మంటల్లో బుగ్గి కావడం టెస్లాకు మింగుడు పడని అంశంగా మారింది. 
 

చదవండి : BMW : ఎం5 కాంపిటీషన్‌... ఓ‍న్లీ ఆన్‌లైన్‌ బుకింగ్‌

మరిన్ని వార్తలు