USA : ద్రవ్యోల్బణం ఆందోళనలు ? పడిపోతున్న రూపాయి విలువ !

11 Dec, 2021 16:14 IST|Sakshi

డాలర్‌ మారకంలో మరో 18పైసలు డౌన్‌

వరుసగా మూడు వారాల నుంచి పతన ధోరణి   

అమెరికాలో అక్టోబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.2 శాతంగా నమోదయ్యింది. గడచిన 31 సంవత్సరాల్లో ఈ స్థాయి అధిక ద్రవ్యోల్బణం నమోదుకాలేదు. ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందన్న భయాలూ ఉన్నాయి. నవంబర్‌లో 6.8 శాతం వరకూ ద్రవ్యోల్బణం నమోదవుతుందన్న అంచనాలు, దీనితో ఫెడ్‌ ఫండ్‌ రేటు (ప్రస్తుతం 0.25 శాతం) పెంపు తప్పదన్న విశ్లేషణలు, ఇదే జరిగితే భారత్‌సహా వర్థమాన దేశాల నుంచి, ఈక్విటీ వంటి రిస్కీ అసెట్స్‌ నుంచి డాలర్ల రూపంలోని విదేశీ నిధులు భారీగా వెనక్కు వెళ్లి డాలర్‌ ఇండెక్స్‌ బలోపేతం అవుతుందన్న అభిప్రాయాలు రూపాయి సెంటిమెంట్‌ను బలహీనపరుస్తున్నట్లు నిపుణుల అంచనా.
ఇక్కడ అవే భయాలు !
ఇక దేశీయంగా చూసినా కమోడిటీ ధరల తీవ్రత భయాలు ఒకపక్క కొనసాగుతున్నాయి. దీనికితోడు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును వరుసగా తొమ్మిదవ ద్వైమాసిక సమావేశాల్లోనూ  యథాతథంగా (4 శాతం)  కొనసాగిస్తూ సరళతర ఆర్థిక విధానం కొనసాగించడం దేశంలోనూ ద్రవ్యోల్బణం భయాలకు ఆజ్యం పోస్తోంది.  ఈ అంశంసహా మహమ్మారి కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్,  అధిక వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం) భయాలూ రూపాయికి ప్రతికూలంగా ఉన్నాయి. ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో  డాలర్‌ మారకంలో రూపా యి విలువ  నష్టాల్లో 75.70వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్‌ ఫ్రాంక్, జపనీస్‌ యన్, కెనడియన్‌ డాలర్, బ్రిటన్‌ పౌండ్, స్వీడిష్‌ క్రోనా)  ప్రాతిపదకన లెక్కించే డాలర్‌ ఇండెక్స్‌  భారీ లాభాల్లో  96.40 వద్ద ట్రేడవుతోంది.  రూపాయికి ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌ లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్‌ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్‌ 16వ తేదీ).


రూపాయికి తగ్గిన ‘విదేశీ నిధుల’ బలం 
డాలర్‌ మారకంలో రూపాయి విలువ శుక్రవారం మరో 18 పైసలు కోల్పోయింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో 75.78 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్ల బలహీన ధోరణి, విదేశీ నిధులు వెనక్కు మళ్లడం, ద్రవ్యోల్బణం భయాలు రూపాయి బలహీనతకు ప్రధాన కారణం. రూపాయి గడచిన 16 నెలల కాలంలో ఇంత కనిష్ట స్థాయిని (22 జూన్‌ 2020లో 75.78) చూడ్డం ఇదే తొలిసారి. 75.65 వద్ద రూపాయి ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఒక దశలో 75.85 స్థాయినీ చూసింది. మూడు వారాల నుంచి రూపాయి బలహీనపడుతోంది. తాజా సమీక్షా వారం (6వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య) 0.88 శాతం అంటే 66 పైసలు క్షీణించింది.  

చదవండి: బ్యాంకింగ్‌ లిక్విడిటీలో తీవ్ర ఒడిదుడుకులు!

మరిన్ని వార్తలు