మార్కెట్లో ఒడిదుడుకులు ఉండొచ్చు

27 Sep, 2021 03:54 IST|Sakshi

డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల ముగింపు..,  

అధిక వ్యాల్యువేషన్ల నేపథ్యంలో అప్రమత్తతకు అవకాశం 

స్థిరీకరణ చోటు చేసుకోవచ్చు 

మార్కెట్‌ గమనంపై విశ్లేషకుల అంచనాలు

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. సెప్టెంబర్‌ సిరీస్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టుల తేది ఈ గురువారంతో ముగియనుంది. సూచీలు జీవితకాల గరిష్టస్థాయికి చేరడంతో పలు షేర్లు అధిక విలువల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఆటో కంపెనీలు సెపె్టంబర్‌ వాహన విక్రయ గణాంకాలను శుక్రవారం విడుదల చేయనున్నాయి.

అదే రోజున కేంద్ర గణాంకాల శాఖ సెపె్టంబర్‌ తయారీ రంగ డేటాను,  ఆర్‌బీఐ సెపె్టంబర్‌ 24తో ముగిసిన వారం నాటి ఫారెక్స్‌ నిల్వల గణాంకాలను విడుదల చేయనున్నాయి. ఈ వారంలోనే ఒక ఐపీఓతో పాటు మరో లిస్టింగ్‌ ఉంది. ఈ పరిమాణాల దృష్ట్యా ఇన్వెస్టర్ల అప్రమత్తతతో మార్కెట్‌ కొంత ఒడిదుడుకులకు లోనుకావచ్చు. ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల పోకడలు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు తదితర అంశాల ప్రభావం కూడా స్టాక్‌ మార్కెట్‌పై ఉంటుందని నిపుణులు అంటున్నారు.

టెలికాం, టెక్, క్యాపిటల్‌ గూడ్స్, ఇంధన ఆటో రంగాల షేర్లు రాణించడంతో గతవారంలో సెన్సెక్స్‌ 1033 పాయింట్లు ఆర్జించింది. తొలిసారి 60వేల పైన ముగిసింది. నిఫ్టీ 268 పాయింట్లు లాభపడింది. సూచీలకిది వరుసగా ఐదోరోజూ లాభాల ము గింపు కావడం విశేషం. ‘సూచీలు భారీ వ్యాల్యూవేషన్లతో ట్రేడ్‌ అవుతున్న తరుణంలో ట్రేడర్లు అప్రమత్తత వహించవచ్చు. దీంతో లాభాలు పరిమితం గా ఉండొచ్చు. నిఫ్టీకి ఎగువస్థాయిలో 18,000 స్థాయి వద్ద బలమైన నిరోధం ఉంది. లాభాల స్వీకరణ జరిగితే 17,500 వద్ద తక్షణ మద్దతు ఉంది’ అని సామ్కో రీసెర్చ్‌ హెడ్‌ నిరాళీ షా తెలిపారు.

జోరుగా విదేశీ పెట్టుబడులు  
దేశంలోకి విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐల) పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. ఈ సెపె్టంబర్‌ 1–24 తేదిల్లో ఎఫ్‌ఐఐలు నికరంగా రూ. 21,875 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇందులో ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.13,536 షేర్ల విలువైన షేర్లను కొన్నారు. డెట్‌ మార్కెట్‌లో రూ.8,339 కోట్లు పెట్టుబడులు పెట్టారు. దేశీయ ఈక్విటీలపై ఎఫ్‌ఐఐల బుల్లిష్‌ వైఖరి కొనసాగితే సూచీల రికార్డుల ర్యాలీ కొనసాగ వచ్చని స్టాక్‌ నిపుణులు చెబుతున్నారు.

బుధవారం ఆదిత్య బిర్లా సన్‌ ఐపీఓ  
అదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఏఎంసీ ఐపీఓ సెపె్టంబర్‌ 29న (బుధవారం) మొదలై అక్టోబర్‌ ఒకటవ తేదిన ముగియనుంది. ధరల శ్రేణిని రూ.695–712 గా నిర్ణయించారు. కంపెనీ ఇష్యూ ద్వారా 3.88 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ చేయనుంది. ఇందులో ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ 28.5 లక్షలకు పైగా షేర్లను విక్రయించనుండగా, సన్‌ లైఫ్‌ (ఇండియా) ఏఎంసీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ 3.6 కోట్లకు పైగా ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా విక్రయించనుంది. ఈ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.2,768.25 కోట్లను సమీకరించనుంది. కనీసం ఒక లాట్‌ సైజ్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఐపీఓ ప్రక్రియ పూర్తైన తర్వాత షేర్లు అక్టోబర్‌ 11న ఎక్చ్సేంజీల్లో లిస్ట్‌కానున్నాయి.

శుక్రవారం పరస్‌ డిఫెన్స్‌ షేర్ల లిస్టింగ్‌   
పరస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌ టెక్నాల జీస్‌ షేర్లు శుక్రవారం ఎక్సే్చంజ్‌ల్లో లిస్ట్‌ కానున్నాయి. ధరల శ్రేణిని రూ.165 – 175గా నిర్ణయించి కంపెనీ రూ.170.70 కోట్లను సమీకరించింది. ఈ ఐపీఓ ఏకంగా 304 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 71.4 లక్షలకుపైగా షేర్లను విక్రయానికి ఉంచగా.., 217 కోట్లకుపైగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల (క్విబ్‌) విభాగంలో 170 రెట్లు, నాన్‌ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల కేటగిరీలో 928 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలయ్యాయి. ఇక రిటైల్‌ ఇన్వెస్టర్లు సైతం 112 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు.

మరిన్ని వార్తలు