ఈ బ్యాంకుల్లో అపరిమిత ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్‌..!

21 Jun, 2021 21:07 IST|Sakshi

ముంబై: ఎటీఎం లావాదేవీలపై బ్యాంకులు ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు వసూలు చేసుకోవచ్చునని రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా గత కొన్ని రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో బ్యాంకు ఖాతాదారులపై మరింత భారం పడనుంది. ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ ట్రాన్సాక్షన్‌  పరిమితి దాటితే ట్రాన్సాక్షన్‌ ఫీజును వసూలు చేయనున్నాయి.  పరిమితికి మించి లావాదేవీలు జరిపితే ఒక్కో లావాదేవీకి రూ. 20 నుంచి రూ.21 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు 2022 జనవరి 1, నుంచి అమలులోకి రానున్నాయి. బ్యాంకు ఖాతాదారులు తమ సొంత బ్యాంకు ఏటీఎం నుంచి 5 ఉచిత ఫైనాన్షియల్‌, నాన్‌ ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్‌ చేసుకోవచ్చును. ఇతర బ్యాంకు ఏటీఎంలో మెట్రో నగరాల్లో 3 సార్లు, గ్రామీణ ప్రాంతాల్లో 5 ఉచిత లావాదేవీలను నిర్వహించవచ్చును.

కాగా కొన్ని బ్యాంకులు తమ ఖాతాదారుల కోసం అపరిమిత ఎటీఎం లావాదేవీలు జరుపుకోవచ్చునని ప్రకటించాయి. ఇండస్‌ఇండ్‌, ఐడీబీఐ వంటి ప్రైవేటు బ్యాంకులు ఈ ఆఫర్‌ను తమ కస్టమర్లకు అందిస్తున్నాయి. ​ఐడీబీఐ బ్యాంకు ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన వాటికి పూర్తిగా అపరిమిత ఉచిత ఎటీఎం లావాదేవీలను జరుపుకోవచ్చును. కాగా ఐడీబీఐ బ్యాంక్ ఆర్బీఐ నిర్దేశించిన కనీస ఉచిత పరిమితులకు అనుగుణంగా ఉచిత ఎటీఎం లావాదేవీలను అందిస్తుంది. బ్యాంక్ తన స్వంత ఎటిఎంలలో 5 ఉచిత లావాదేవీలను,  ఇతర బ్యాంక్ ఎటిఎంలలో, ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో మూడు ఉచిత లావాదేవీలను కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని ఐడిబిఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జోర్టీ చాకో పేర్కొన్నారు.

ఇండస్ఇండ్ బ్యాంక్ తన బ్యాంకు ఖాతాదారులకు దేశవ్యాప్తంగా ఏ బ్యాంక్ ఏటీఎం నుంచైనా అపరిమిత ఉచిత ఏటీఎం లావాదేవీలను అందిస్తోందని ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ తన వెబ్‌సైట్‌ పేర్కొంది. సేవింగ్స్ ఖాతాలో రూ.25వేల కంటే ఎక్కువ సగటు బ్యాలెన్స్ నిర్వహిస్తోన్న అకౌంట్ హోల్డర్లకు సిటీ బ్యాంకు కూడా అపరిమిత ఉచిత లావాదేవీలను అందిస్తోంది.  ప్రభుత్వ బ్యాంకింగ్‌ రంగ దిగ్గజం ఎస్బీఐ తన ఖాతాదారులకు  రూ.1 లక్ష కంటే ఎక్కువ బ్యాలెన్స్ కలిగి ఉన్న వారికి ఏ ఏటీఎంలోనైనా అపరిమిత ఉచిత ట్రాన్సాక్షన్‌ ఇ‍వ్వనుంది.

చదవండి: గోల్డ్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్!

మరిన్ని వార్తలు