భారత్‌లో యాపిల్‌ రీటైల్‌ స్టోర్‌.. టిమ్‌కుక్‌ అదిరిపోయే మాస్టర్‌ ప్లాన్‌!

14 Apr, 2023 19:45 IST|Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ వచ్చే భారత్‌లో తొలి రీటైల్‌ స్టోర్‌ను ప్రారంభించబోతుంది. దేశంలో ఐఫోన్‌ల తయారీని వేగంగా విస్తరిస్తున్న యాపిల్‌ తన రిటైల్ స్టోర్‌ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది.  ఈ క్రమంలో రీటైల్‌ స్టోర్‌ ప్రారంభం కంటే ముందే తన ప్రత్యర్ధులకు చెక్‌ పెట్టేలా ఆ సంస్థ సీఈవో టిమ్‌కుక్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.   

ముంబైలో ఆసియా అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన ‘బంద్రా కుర్లా కాంప్లెక్స్‌’లోని జియో వరల్డ్‌ డ్రైవ్‌ మాల్‌లో యాపిల్‌ స్టోర్‌ను ఏర్పాటు చేస్తుంది. రిటైల్ స్టోర్ ఏర్పాటు చేయడం ద్వారా యాపిల్‌ స్పెషల్‌ డిస్కౌంట్‌ పొందినట్లు తెలుస్తోంది. ఇందుకోసం టిమ్‌కుక్‌.. జియో వరల్డ్‌ డ్రైవ్‌ యాజమాన్యానికి కొన్ని షరతులు పెట్టారని, ఆ షరతులకు లోబడే యాపిల్‌ రీటైల్‌ స్టోర్‌ ఏర్పాటు అంగీకరించినట్లు సమాచారం. ఇంతకీ ఆ షరతు ఏంటంటే? 

ముంబైలోని రిలయన్స్ జియో వరల్డ్ డ్రైవ్ మాల్‌లో రీటైల్‌ స్టోర్‌ ఏర్పాటు కోసం యాపిల్‌ సంస్థ 20,800 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని 11 ఏళ్ల పాటు లీజుకు తీసుకుంది. లీజు ఒప్పందం ప్రకారం.. నెలకు రూ.42 లక్షలను అద్దె రూపంలో చెల్లించనుంది. ఈ లెక్కన ఏడాదికి అద్దె రూపంలోనే రూ.5 కోట్లను  చెల్లిస్తుండగా.. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి అద్దె 15 శాతం మేర పెంపు ఉంటుంది. ఆ మూడేళ్లలో 2 శాతం రెవెన్యూ షేర్‌, మూడేళ్ల తర్వాత 2.5 శాతం రెవెన్యూ షేర్‌ను అంబానీ సంస్థకు చెల్లించనుంది.   

అదే సమయంలో కొన్ని కండీషన్లు పెట్టింది. డేటా అనలటిక్స్‌ సంస్థ సీఆర్‌ఈ మ్యాట్రిక్స్‌ రిపోర్ట్‌ ప్రకారం.. రీటైల్‌ స్టోర్‌ ఏర్పాటు అనంతరం ఆ ప్రాంతంలో 21 సంస్థలకు చెందిన బ్రాండ్ల యాడ్స్‌ను డిస్‌ప్లే చేసేందుకు వీలు లేదు. వాటిల్లో అమెజాన్‌,ఫేస్‌బుక్‌, గూగుల్‌, ఎల్‌జీ, మైక్రోసాఫ్ట్‌, సోనీ, ట్విటర్‌, బోస్‌, డెల్‌, డెలాయిట్‌ , ఫాక్స్‌కాన్‌, గార్‌మిన్‌, హిటాచీ, హెచ్‌పీ, హెచ్‌టీసీ, ఐబీఐఎం, ఇంటెల్‌, లెనోవో, నెస్ట్‌, ప‍్యానసోనిక్‌, తోషిబా, శాంసంగ్‌ వంటి సంస్థలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు