ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు

30 Mar, 2021 15:39 IST|Sakshi

కొత్త 2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ 1 నుంచి అనేక విషయాలలో కీలక మార్పులు చోటు చేసుకుంటుంటాయి. కాబట్టి మార్చి నెలలో ఎక్కువ శాతం ప్రజలు కొత్త నిబంధనల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, నిబంధనలకు గడువును పొడిగించిన విషయం తెలిసిందే. ఇందులో పాన్-ఆధార్ కార్డు లింకు, ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు గడువు వంటివి ఉన్నాయి. ఈసారి కార్లు, బైక్‌లు, టీవీలు, ఏసీల ధరల రూపంలో సామాన్యులపై ఒకటో తారీఖు నుంచి భారం పడే అవకాశం ఉంది. ఇలాంటివి చాలానే ఉన్నాయి‌.. అవేంటంటే..

ఈ బ్యాంకుల పాస్​బుక్​, చెక్​బుక్​లు చెల్లవు
ఆంధ్రా బ్యాంకు, దేనా బ్యాంకు, విజయా బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకు, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంక్‌ ఈ ఏడు బ్యాంకుల్లో ఖాతాలున్నాయా? అయితే ఇప్పుడు ఆ బ్యాంకుల పాస్​బుక్​, చెక్​బుక్​లు వచ్చే నెల ఏప్రిల్ 1 నుంచి చెల్లవు. ఎందుకంటే ఈ ఏడు బ్యాంకులు వేర్వేరు బ్యాంకుల్లో విలీనమయ్యాయి. ఇతర బ్యాంకుల్లో విలీనమైన కస్టమర్లు సంబంధిత బ్యాంకు శాఖలను సంప్రదించి మారిన ఎంఐసిఆర్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్, పాస్​బుక్​, చెక్​బుక్​ మొదలైనవి పొందాల్సి ఉంటుంది. 

ఈపీఎఫ్‌ ఖాతాలో ఎక్కువ జమ చేస్తున్నారా?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2021లో ప్రావిడెంట్ ఫండ్‌పై కీలక ప్రకటన చేశారు. ప్రావిడెంట్ ఫండ్‌ ఖాతాలో ఏడాదికి రూ.2.5 లక్షలకు పైన జమ అయ్యే నగదుపై లభించే వడ్డీ మొత్తంపై ఇక నుంచి పన్ను పడనున్నట్లు వెల్లడించారు. రూ.2.5 లక్షల లోపు వరకు గల డిపాజిట్ మొత్తంపై వచ్చే వడ్డీ మొత్తానికి ఎలాంటి పన్ను కట్టక్కర్లేదు. ప్రతి ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో ఉద్యోగి మూల వేతనం నుంచి 12 శాతం జమ అవుతుంది. అలాగే ఇదే మొత్తానికి సమానమైన మొత్తాన్ని కంపెనీ కూడా ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పీఎఫ్ ఖాతాలో ఎక్కువ నగదును జమ చేసే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది.

బ్యాంకు డిపాజిట్లపై రెట్టింపు టీడీఎస్‌
ఎక్కువ మంది ఆదాయపు పన్ను రిటర్నులు(ఐటిఆర్) దాఖలు చేయడం కోసం ఆర్థిక మంత్రి 2021 బడ్జెట్‌లో అధిక టిడిఎస్(మూలం వద్ద పన్ను) లేదా టిసిఎస్ (మూలం వద్ద వసూలు చేసిన పన్ను) రేట్లు ప్రతిపాదించారు. ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయనివారిపై టీడీఎస్, టీసీఎస్‌ల‌ అధిక రేట్లు విధించేందుకు ప్రత్యేక నిబంధనగా ఆదాయపు పన్ను చట్టంలో 206ఎబి, 206 సిసిఎ తీసుకొచ్చారు.  ఈ నిబంధన ఏప్రిల్‌ 1 నుంచే అమల్లోకి వస్తుంది. అంటే ఆదాయ పన్ను శ్లాబులో లేనివారు కూడా ఐటీఆర్‌ దాఖలు చేయకపోతే రెట్టింపు టీడీఎస్‌ను కట్టాల్సి వస్తుంది. ఐటీ రిటర్నుల దాఖలును ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. 

కార్లు, బైక్‌లు, ఏసీలు ధరలు పెంపు
కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి కార్ల, బైక్‌లు, ఏసీలు ధరలు పెరగనున్నాయి. అంతర్జాతీయంగా సరఫరా కొరత కారణంగా కమొడిటీ, లోహ ధరలు పెరగడంతో కార్లు, బైక్‌ల సంస్థలు రేట్లు పెంచక తప్పడం లేదని కంపెనీలు చెబుతున్నాయి. తయారీ వ్యయాలు పెరగడంతో ఏసీ, రిఫ్రిజిరేటర్ల ధరలు ఆ మేరకు పెరగనున్నాయి. ఏసీ ధరలు రూ.1500-2000 వరకు పెరగవచ్చు.

విమానం చార్జీల మోత
ఏప్రిల్‌ నుంచి విమాన ప్రయాణికులు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. భారత విమానాశ్రయాల్లో ఏవియేషన్‌ సెక్యూరిటీ ఫీజు(ఏఎస్‌ఎఫ్‌) పెరగనుంది. ఏప్రిల్‌ 1 నుంచి జారీ అయ్యే టికెట్లపై ఈ కొత్త రేట్లు వర్తిస్తాయి. దేశీయ ప్రయాణికులపై రూ.200 చొప్పున, అంతర్జాతీయ ప్రయాణికులపై 12 డాలర్ల చొప్పున ధర పెరగనుంది. అయితే రెండేళ్లలోపు చిన్నారులకు, డిప్లొమాటిక్‌ పాస్‌పోర్టులున్నవారు తదితర ప్రత్యేక వర్గాలకు ఈ ఫీజు నుంచి మినయింపు ఇచ్చారు. 

కంపెనీలు క్రిప్టోకరెన్సీ లెక్క చెప్పాల్సిందే
కంపెనీలు ఏప్రిల్‌ 1 నుంచి తమ వద్ద ఉండే క్రిప్టోకరెన్సీ వివరాలను తప్పనిసరిగా ఆర్థిక ఖాతాల్లో వెల్లడించాల్సి ఉంటుంది. కంపెనీకి చెందిన ఆర్థిక అంశాలు వాటాదార్లకు తెలియాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిబంధనను తీసుకొచ్చింది. ఆర్థిక ఫలితాలను ప్రకటించే తేదీ నాటికి ఎంత మేర క్రిప్టోకరెన్సీ ఉందన్నదో చెప్పాలి. అంతే కాదు.. వాటిపై వచ్చిన లాభం, నష్టాలనూ వెల్లడించాలి. ఈ కరెన్సీల్లో ట్రేడింగ్‌/పెట్టుబడులకు ఇతరుల నుంచి తీసుకునే డిపాజిట్లు, అడ్వాన్సులనూ ఆయా కంపెనీలు చెప్పాల్సి ఉంటుంది.

చదవండి:

మరిన్ని పట్టణాలకు అమెజాన్‌ ప్యాంట్రీ

లోన్ తీసుకునేవారికి ఎస్‌బీఐ తీపికబురు

మరిన్ని వార్తలు