ఇదేం కెమిస్ట్రీ బాబు!... షేర్ల ధర అలా పెరిగింది.. కనక వర్షమే

14 Oct, 2021 12:19 IST|Sakshi

వెండితెరపై హీరో హీరోయిన్ల జోడీ బాగా కుదిరితే వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది అంటారు. అచ్చంగా స్టాక్‌మార్కెట్‌లో ఇన్వెస్టర్లు, లాభాల మధ్య కెమికల్‌ షేర్ల విషయంలో ఏడాది కాలంగా చక్కని కెమిస్ట్రీ కుదురుతోంది. ఈ కెమికల్‌ కంపెనీలు ఇన్వెస్టర్లకు  భారీ లాభాలను అందిస్తున్నాయి. 

యాక‌్షన్‌.. రియాక‌్షన్‌
అణువులు పరమాణువులు అందులో ఉండే ఎలక్ట్రాన్ల మధ్య చర్యలతో కూడినదే కెమిస్ట్రీ. కంటికి కనిపించనంత సూక్ష్మస్థాయిలో జరిగే రసాయనిక చర్యల కారణంగా కొత్త పదార్థాలు పుట్టుకొస్తాయి. అదేవిధంగా ఎక్కడో చైనాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, అంతర్జాతీయ వ్యవహరాలు ఇండియాలో కెమికల్‌ షేర్ల ధరలకు కొత్త రెక్కలు తొడుగుతున్నాయి. 

ఏడాదిలో ఐదింతలు
ఏడాది వ్యవధిలోనే దేశీ స్టాక్‌మార్కెట్‌లో ఐదు కెమికల్‌ కంపెనీల షేర్ల ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఈ షేర్లలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి ఏడాది వ్యవధిలోనే కనీసం లక్షకు రెండు లక్షలు మొదలు ఐదు లక్షల రూపాయల వరకు లాభాలు అందించాయి. ఐటీ, మెటల్‌, ఫైనాన్స్‌ కంపెనీలను వెనక్కి నెట్టి ముదుపరులకు అతి భారీ లాభాలను స్వల్ప కాలంలోనే కెమికల్‌ షేర్లు అందిస్తున్నాయి. అలా ఇన్వెస్టర్లకు కనకవర్షం కురిపించిన కొన్ని కంపెనీలు, వాటి షేర్ల ధరల వివరాలు
ఇన్వెస్టర్ల ఇంట సిరుల పంట
- బాలాజీ అమీన్స్‌ అనే కెమికల్‌ కంపెనీ 1988లో మార్కెట్‌లో లిస్టయ్యింది. అప్పటి నుంచి గతేడాది వరకు ఈ కంపెనీ షేరు విలువ సాధారణ స్థాయిలోనే పెరుగుతూ వచ్చింది. కానీ గత ఏడాది వ్యవధిలో ఈ కంపెనీ షేరు విలువ 450 శాతం పెరిగింది. 2020 అక్టోబరు 20న ఈ కంపెనీ ఒక షేరు విలువ రూ. 816 ఉండగా 2021లో ఈ ధర అమాంతం పెరిగి రూ.4,488లకు చేరుకుంది. ఈ కంపెనీ మార్కెట్‌ క్యాపిటల్‌ విలువ రూ 14,525 కోట్లకు చేరుకుంది. ఈ కంపెనీ ఫార్మా రంగానికి సంబంధించిన కెమికల్స్‌ తయారు చేస్తోంది. 
-  గుజరాత్‌ ఫ్లోరో కెమికల్స్‌ కంపెనీ 1987లో నోయిడా సమీపంలో స్థాపించారు. ఈ కంపెనీ రిఫ్రిజరెంట్‌ గ్యాసెస్‌, కాస్టిక్‌ సోడా, క్లోరో మీథేన్‌ తదితర రసాయనాలు తయారు చేస్తుంది. ఈ కంపెనీ షేర్‌ వ్యాల్యూ 2020 అక్టోబరులో రూ. 484 ఉండగా ప్రస్తుతం ఈ విలువ రూ. 2,167లకు చేరుకుంది. ఏడాది వ్యవధిలోనే కంపెనీ షేర్‌ వ్యాల్యూ 348 శాతం పెరిగింది.
- దీపక్‌ నైట్రేట్‌ సంస్థ బల్క్‌ కెమికల్‌ కమోడిటీస్‌ని తయారు చేస్తుంది. ఈ కంపెనీ షేరు విలువ గతేడాది రూ. 716లు ఉండగా 2021 అక్టోబరు వచ్చేసరికి 298 శాతం పెరిగి ఒక్కో షేరు ధర రూ. 2,852లుగా పలుకుతోంది. పెట్రోకెమికల్స్‌, అగ్రోకెమికల్స్‌, ఫార్మా తదితర రంగాలకు ఈ కంపెనీ నుంచి బల్క్‌ కెమికల్స్‌ వెళ్తుంటాయి.
- ప్రివీ స్పెషాలిటీ కెమికల్‌ సంస్థ షేర్లు ఏడాది వ్యవధిలో 258 శాతం పెరిగాయి. గతేడాది అక్టోబరులో షేరు విలువ రూ.527లు ఉండగా ప్రస్తుతం అది రూ.1,891కి చేరుకుంది.  ఏడాది వ్యవధిలో గరిష్టంగా రూ.2,070ని తాకగా కనిష్టంగా రూ.501కి పడిపోయింది.
- అ‍ల్కైల్‌ అమీన్స్‌ సంస్థ పెయింట్స్‌, రబ్బర్‌, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ తదితర రంగాలకు కెమికల్స్‌ని సరఫరా చేస్తుంది,. గతేడాది ఈ కంపెనీ షేరు విలువ రూ.1,228 ఉండగా ఏడాది కాలంలో 223 శాతం పెరిగి ప్రస్తుతం రూ.3970 దగ్గర ట్రేడవుతోంది. ఈ ఏడాది కాలంలో గరిష్టంగా రూ.4,749కి చేరుకోగా కనిష్టంగా రూ. 1,138కి పడిపోయింది.
కారణం ఇదేనా?
కరోనా విపత్తుతో ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు మారిపోయాయి. కెమికల్‌ ఉత్పత్తులకు సంబంధించి ప్రపంచానికి చైనా అతి పెద్ద తయారీ, సరఫరాదారుగా ఉండేది. కానీ కరోనాతో పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రపంచ దేశాలు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌వైపు చూస్తున్నాయి. మరోవైపు సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం సైతం చైనా దిగుమతుల పట్ల సానుకూలంగా లేదు. దీంతో దేశీ కెమికల్‌ కంపెనీలకు డిమాండ్‌ పెరిగింది. 
బ్లూచిప్‌లను మించి
మెరుగైన పనితీరు కనిపిస్తున్న కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కంపెనీలన్నీ మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కేటగిరీల్లోనే ఉన్నప్పటికీ ముదుపరులకు భారీ లాభాలు అందివ్వడంలో బ్లూచిప్‌ కంపెనీలను వెనక్కి నెడుతున్నాయి. 


చదవండి:9 రోజుల్లో 1600 కోట్లు సంపాదించాడు..! ఎలాగంటే..!

మరిన్ని వార్తలు