ఈ కార్ల ఉత్పత్తికి హోండా మంగళం: ఏప్రిల్ నుంచే షురూ!

28 Mar, 2023 07:47 IST|Sakshi

గతంలో బిఎస్6 ఉద్గార నిబంధనలు అమలులోకి వచ్చిన తరువాత చాలా కార్ల ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే 2023 ఏప్రిల్ 01నుంచి బిఎస్6 ఫేజ్-2 రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) నిబంధనలు అమలులోకి రానున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా కంపెనీలు తమ ఉత్పత్తులలో కొన్నింటిని నిలిపివేయాలని నిర్చయించాయి. ఇందులో హోండా కంపెనీ కూడా ఉంది.

నివేదికల ప్రకారం.. హోండా కంపెనీ ఏప్రిల్ ప్రారంభం నుంచి జాజ్, డబ్ల్యుఆర్-వి, నాల్గవ తరం సిటీ వంటి మోడల్స్ ఉత్పత్తిని నిలిపివేయనుంది. రియల్ డ్రైవింగ్ ఎమిషన్ నిబంధనలు క్యాటలిటిక్ కన్వర్టర్, ఆక్సిజన్ సెన్సార్‌ల వంటి భాగాలను నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి.

బిఎస్6 ఫేస్-2 నిబంధనలు కొంత కఠినంగా ఉంటాయి, కావున కంపెనీ ఉత్పత్తులు మరింత పటిష్టంగా తయారవుతాయి, తద్వారా ధరలు కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కంపెనీ హోండా సిటీ ఐదవ తరం మోడల్, అమేజ్ వంటి వాటిని కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేసినట్లు సమాచారం.


 
ఇప్పటికే కంపెనీ అందించిన సమాచారం ప్రకారం.. వచ్చే నెల ప్రారంభం నుంచే తమ ఉత్పత్తుల ధరలు రూ. 12,000 వరకు పెరిగే అవకాశం ఉందని తెలిసింది. ఇదే బాటలో మరిన్ని కంపెనీలు ముందుకు సాగనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. అయితే ఈ ధరల పెరుగుదల వాహనాల అమ్మకాలపైన ప్రభావం చూపుతుందా? లేదా? అనేది త్వరలో తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు