నిత్యావసరాల కోసం ఇబ్బందులు.. ఆన్‌లైన్‌ ఆర్డర్లపైనా మోత! చూసి కొనండి!!

11 Jan, 2022 09:37 IST|Sakshi

కరోనా కేసుల విజృంభణ భారత్‌లో మొదలైంది. థర్డ్‌ వేవ్‌లోకి ప్రవేశించిన నేపథ్యంలో.. ఆంక్షలు, కర్ఫ్యూలు, వీకెండ్‌ లాక్‌డౌన్‌లతో కొన్ని రాష్ట్రాల్లో వైరస్‌ కట్టడికి చర్యలు మొదలయ్యాయి. ఈ తరుణంలో నిత్యావసరాల అమ్మకాలపై భారీ దెబ్బ పడుతోంది. 


వ్యాక్సినేషన్‌ ఉధృతంగా కొనసాగడం, మరోవైపు కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న జోష్‌.. ప్రొడక్టివిటీ మార్కెట్‌లో స్పష్టంగా కనిపించింది. దీంతో నిత్యావసర సరుకులతో పాటు డ్రై ఫ్రూట్స్‌ వ్యాపారం అద్భుతంగా జరగొచ్చని భావించారు. అక్టోబర్‌ నుంచి పెరిగిన కిరాణ వస్తువుల అమ్మకాలు.. డిసెంబర్‌ మధ్యకల్లా తారాస్థాయికి చేరింది. దీనికి తోడు పెళ్లి, పండుగ సీజనులు వస్తుండడంతో కలిసొస్తుందని వ్యాపారులు అనుకున్నారు. అయితే ఊహించని రీతిలో ఒమిక్రాన్‌ వేరియెంట్‌, కరోనా కేసుల పెరుగుదల దేశవ్యాప్తంగా నిత్యావసరాల అమ్మకాలను దెబ్బ కొడుతున్నాయి.

 

నో సప్లయ్‌
నిత్యావసర దుకాణాల అమ్మకాల జోరుకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. కొవిడ్‌ ఆంక్షలతో హోల్‌ సేల్‌ నుంచి కిందిస్థాయి దుకాణాలకు, చిన్నచిన్న మార్ట్‌లకు సరుకులు చేరడం లేదు. మరోవైపు కఠిన ఆంక్షలతో వాహనాల రాక ఆలస్యమవుతోంది. హోల్‌సేల్‌ షాపుల నుంచి చిన్న చిన్న కిరాణ కొట్టుల దాకా  చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. హోల్‌సేల్‌ మార్కెట్ల నుంచి కిందిస్థాయి మార్కెట్లకు డిమాండ్‌కు తగ్గ సప్లయ్‌ ఉండడం లేదు.  ఇంకోవైపు దుకాణాల ముందు జనాలు.. క్యూలు కట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిణామాలతో అధిక ధరలకు అమ్మకాలు కొనసాగుతున్నాయి చాలా చోట్ల. అయితే హోల్‌సేల్‌ రవాణాకు అనుమతులు లభించడం, ఆంక్షలపై స్వల్ఫ ఊరట ద్వారా  ఈ సమస్య గట్టెక్కొచ్చని భావిస్తున్నారు.
 

ఫ్రెష్‌ సరుకు రవాణాకి అంతరాయం ఏర్పడడంతో చాలాచోట్ల కొన్ని ఉత్పత్తుల మీద అవుట్‌ ఆఫ్‌ స్టాక్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. అయితే కొందరు వ్యాపారులు మాత్రం ఎక్స్‌పెయిర్‌ అయిన ప్రొడక్టులను అలాగే అమ్మేస్తున్నారు. హోల్‌సేల్‌, చిన్ని చిన్న దుకాణాల్లో అయితే అవేం చూడకుండా కొనేస్తున్నారు వినియోగదారులు. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలని, ఎక్స్‌పెయిరీ వగైరా వివరాల్ని ఒకసారి చెక్‌ చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 

   

ఈ-కామర్స్‌ మినహాయింపు
అయితే మెట్రో సిటీ, సిటీ, అర్బన్‌, టౌన్‌లలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ పెరిగింది. ఈ-కామర్స్‌, ఆన్‌లైన్‌ గ్రాసరీ యాప్‌ల ద్వారా డోర్‌ డెలివరీలు నడుస్తున్నాయి. పనిలో పనిగా డెలివరీ ఛార్జీలపై అదనపు బాదుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఫిబ్రవరి చివరి దాకా ఇదే పరిస్థితి కొనసాగవచ్చనే అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్త:  షాపుల ముందు తగ్గుతున్న ‘క్యూ’లు.. జోరందుకున్న ఆన్‌లైన్‌ ఆర్డర్లు

మరిన్ని వార్తలు