ఆరంభ శూరత్వం..ట్విటర్‌ దెబ్బకు చాప చుట్టేసిన ‘థ్రెడ్స్‌’!

22 Jul, 2023 19:38 IST|Sakshi

ఆరంభంలో శూరత్వం అన్నట్టు.. ట్విటర్‌కు పోటీగా ఎదురైన కొన్ని రోజులకే థ్రెడ్స్‌ యూజర్ల విషయంలో చాప చుట్టేస్తున్నట్లు తెలుస్తోంది. రోజులు గడిచే కొద్ది యాక్టీవ్‌ యూజర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

మెటా అధినేత మార్క్‌ జుకర్ బర్గ్‌.. థ్రెడ్స్‌ను యూజర్లకు పరిచయం చేసిన ప్రారంభంలో దాని రోజూ వారీ యూజర్లు 10 మిలియన్ యూజర్లు ఉన్నట్లు తెలిపారు. కానీ ఇటీవల విడుదలైన నివేదిక మాత్రం పూర్తి భిన్నంగా చూపిస్తోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. యాప్‌లో రోజువారీ యాక్టీవ్‌ యూజర్ల సంఖ్య వరుసగా రెండవ వారం పడిపోయింది. ఇప్పుడు 13 మిలియన్లకు చేరుకుంది.  జూలై ప్రారంభంలో గరిష్ట స్థాయి నుండి 70 శాతం యూజర్లు తగ్గినట్లు సూచిస్తుంది. 

అదే సమయంలో ట్విటర్‌ రోజువారీ యాక్టీవ్‌ యూజర్లు 200 మిలియన్లు ఉన్నారు. దీంతో ట్విటర్‌కు గట్టి పోటీ ఇవ్వాలంటే థ్రెడ్స్‌కు భారీ ఎత్తున యూజర్లు కావాల్సి ఉంటుంది. దీంతో పాటు సైన్‌ ఆప్‌ల విషయంలో మార్క్‌ జుకర్‌ బెర్గ్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటూ వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్‌ చేస్తున్నారు. 

జులై 5న అందుబాటులోకి వచ్చిన థ్రెడ్స్‌ ప్రారంభం రోజుల్లో.. లాగిన్‌ అయ్యేందుకు యూజర్లు పోటెత్తేవారు. రాను రాను అలా సైన్‌ అప్‌ అయ్యే వారి సంఖ్య సైతం తగ్గింది. వినియోగదారుల్లో ఆసక్తి తగ్గుతూ వస్తుంది. యూజర్ల సంఖ్య భారీగా పడిపోతున్నప్పటికీ మెటా యాజమాన్యం ట్విటర్‌కు పోటీ థ్రెడ్సేనన్న సంకేతాలిస్తుంది. యాప్‌ను పునరుద్ధరిస్తూ కొత్త ఫీచర్లను పరిచయం చేసేలా దృష్టిసారిస్తున్నట్లు తెలిపింది.

అయినప్పటికీ, వినియోగదాలు తగ్గిపోకుండా ట్విటర్‌ ఎలాంటి ఫీచర్లను యూజర్లకు అందిస్తుందో.. థ్రెడ్స్‌ సైతం అవే ఫీచర్లను ఎనేబుల్‌ చేయాలని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు