లక్ష కోట్ల ఐపీవోలకు రెడీ

10 Mar, 2021 04:34 IST|Sakshi

జాబితాలో ఎన్‌ఎస్‌ఈ, హెచ్‌డీబీ ఫైనాన్షియల్, ఆధార్‌ హౌసింగ్, డెలివరీ, సెంబ్‌కార్ప్‌ ఎనర్జీ 

ప్రైమరీ మార్కెట్లో 2017 రికార్డులు బ్రేకయ్యే చాన్స్‌ 

బీమా దిగ్గజం ఎల్‌ఐసీ జత కలిస్తే మరో రికార్డ్

దేశీ క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి నిధుల సమీకరణకు ఇటీవల పలు కంపెనీలు క్యూ కడుతున్నాయి. జాబితాలో స్టాక్‌ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ, హెచ్‌డీబీ ఫైనాన్షియల్, ఆధార్‌ హౌసింగ్, డెలివరీ, సెంబ్‌కార్ప్‌ ఎనర్జీ తదితరాలున్నాయి. పీఎస్‌యూ దిగ్గజం ఎల్‌ఐసీని పక్కనపెడితే.. రూ. లక్ష కోట్లకుపైగా సమీకరించే ప్రణాళికలు ప్రకటించాయి. దీంతో ఈ కేలండర్‌ ఏడాది(2021)లో ప్రైమరీ మార్కెట్లు సరికొత్త రికార్డులకు వేదికయ్యే వీలున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం... 

ముంబై: కొద్ది నెలలుగా ప్రపంచ దేశాలను కోవిడ్‌–19 వణికిస్తున్నప్పటికీ దేశీయంగా స్టాక్‌ మార్కెట్లు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. దీంతో పలు కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలను చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. తద్వారా భారీగా నిధులను సమీకరించాలని ఆశిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది(2021)లో ఐపీవోల ద్వారా కంపెనీలు రూ. లక్ష కోట్లకుపైగా నిధులను సమీకరించే వీలున్నట్లు మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. పబ్లిక్‌ ఇష్యూ బాటలో సాగనున్న ప్రధాన సంస్థలలో ఎన్‌ఎస్‌ఈ(రూ. 10,000 కోట్లు), హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌(రూ. 9,000 కోట్లు), ఆధార్‌ హౌసింగ్‌(రూ. 7,300 కోట్లు), డెల్హివరీ(రూ. 6,000 కోట్లు), సెంబ్‌కార్ప్‌ ఎనర్జీ, స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌(రూ. 5,000 కోట్లు), జొమాటో(రూ. 4,000 కోట్లు) తదితరాలను ప్రస్తావించవచ్చు. వెరసి ఈ ఏడాది ప్రైమరీ మార్కెట్లో 2017లో నమోదైన చరిత్రాత్మక రికార్డులు బ్రేకయ్యే అవకాశమున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఇప్పటికే రూ. 13,000 కోట్లు...
ఈ ఏడాది ఇప్పటికే 9 కంపెనీలు ఐపీవోలను చేపట్టాయి. తద్వారా రూ. 13,000 కోట్లు సమకూర్చుకున్నాయి. గత వారం ఎంటార్‌ టెక్నాలజీస్‌ రూ. 597 కోట్లు, తాజాగా ఈజీ ట్రిప్‌ ప్లానర్స్‌ రూ. 510 కోట్లు చొప్పున సమీకరించాయి. ఈ బాటలో మరిన్ని కంపెనీలు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేస్తున్నాయి. వెరసి మరో రూ. 90,000 కోట్లకుపైగా సమీకరించే వీలుంది. ప్రస్తుత బుల్‌ రన్‌ నేపథ్యంలో ప్రైమరీ మార్కెట్‌ ద్వారా నైకా, పాలసీ బజార్, మాక్రోటెక్‌ డెవలపర్స్, సంహీ హోటల్స్, ఆరోహణ్‌ ఫైనాన్షియల్, కళ్యాణ్‌ జ్యువెలర్స్, పెన్నా సిమెంట్స్‌ తదితరాలు రూ. 3,500–1,500 కోట్ల మధ్య నిధులను సమకూర్చుకునే సన్నాహాల్లో ఉన్నాయి. ఈ బాటలో తాజాగా ఐపీవోకు అనుమతించమంటూ పరస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌ టెక్నాలజీస్‌ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇక బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్‌ఐసీ సైతం ఈ ఏడాది లిస్టింగ్‌ యోచనలో ఉంది. ఎల్‌ఐసీ ఒక్కటే రూ. లక్ష కోట్ల ఐపీవోను చేపట్టే అవకాశమున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇంతక్రితం ఐపీవోల ద్వారా 2017లో 36 కంపెనీలు రూ. 67,147 కోట్లను సమీకరించాయి. ఇది మార్కెట్‌ చరిత్రలోనే అత్యధికంకాగా.. ఈ ఏడాది మరిన్ని కొత్త రికార్డులు నమోదయ్యే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. 

బుల్‌ జోష్‌ 
కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు భారీ సహాయక ప్యాకేజీలకు తెరతీశాయి. దీంతో 2020 మార్చి నుంచీ లిక్విడిటీ వెల్లువెత్తింది. వెరసి విదేశీ నిధులు అటు స్టాక్స్, ఇటు పసిడి తదితరాలలోకి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా 2020 ఆగస్ట్‌లో దేశీయంగా పసిడి 10 గ్రాములు రూ. 56,000ను అధిగమించగా.. విదేశీ మార్కెట్లో ఔన్స్‌ 2,070 డాలర్లను తాకింది. 2021లో సెన్సెక్స్‌ 52,000కు చేరింది. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌పై దృష్టిసారించాయి. వివిధ రంగాలకు చెందిన బార్బిక్యు నేషన్, శ్రీరామ్‌ ప్రాపర్టీస్, కిమ్స్‌ హాస్పిటల్స్, సూర్యోదయ స్మాల్‌ ఫైనాన్స్, లావా ఇంటర్నేషనల్,  తదితర పలు సంస్థలు ఐపీవోల ద్వారా రూ.1,000–3,000 కోట్ల మధ్య సమీకరించే సన్నాహాల్లో ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

ఈ నెలలో మరో మూడు ఇష్యూలు
♦క్రాఫ్ట్స్‌మ్యాన్‌ ఆటోమేషన్‌ 
♦లక్ష్మీ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌ అనుపమ్‌ రసాయన్‌

ఈ నెలలో మరో మూడు కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టాయి. శుక్రవారం(12) నుంచి అనుపమ్‌ రసాయన్‌ ఐపీవో ప్రారంభంకానుంది. షేరుకి రూ. 553–555 ధరలో ఇష్యూకి వస్తోంది. తద్వారా రూ. 760 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇదే విధంగా సోమవారం(15) నుంచి క్రాఫ్ట్స్‌మ్యాన్‌ ఆటోమేషన్, లక్ష్మీ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌ పబ్లిక్‌ ఇష్యూలను చేపట్టనున్నాయి. క్రాఫ్ట్స్‌మ్యాన్‌ షేరుకి రూ. 1488–1490 ధరలో ఐపీవోకు సిద్ధపడుతోంది. ఇష్యూ ద్వారా రూ. 824 కోట్లు సమకూర్చుకోవాలని చూస్తోంది. ఇక లక్ష్మీ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌ షేరుకి రూ. 129–130 ధరలో పబ్లిక్‌ ఇష్యూని చేపడుతోంది. తద్వారా రూ. 600 కోట్లు సమీకరిస్తోంది. ఈ బాటలో కళ్యాణ్‌ జ్యువెలర్స్, సూర్యోదయ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్, ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌  ఐపీవోలు రాను న్నాయి. వెరసి ఈ నెలలో రూ. 10,000– 12,000 కోట్ల నిధులను సమీకరించే వీలుంది. 

మరిన్ని వార్తలు