రేటు పెంపు కొనసాగించక తప్పదు

19 Sep, 2022 05:09 IST|Sakshi

5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీకి ఐదేళ్లు 9 శాతం వృద్ధి అవశ్యం

ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ సీ రంగరాజన్‌ విశ్లేషణ  

కోల్‌కతా: ద్రవ్యోల్బణం కట్టడికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రస్తుత కఠిన ద్రవ్య పరపతి విధానం కొనసాగించక తప్పదని మాజీ గవర్నర్‌ సీ రంగరాజన్‌ పేర్కొన్నారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులు తిరిగి పుంజుకుంటే, రూపాయి బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. భారత్‌ కోరుకుంటున్న 5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ లక్ష్య సాధనకు వచ్చే ఐదేళ్లూ ఆర్థిక వ్యవస్థ 8 నుంచి 9 శాతం పురోగతి సాధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రామకృష్ణ మిషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కల్చర్‌లో సమర్‌కాంతి పాల్‌ స్మారక ప్రసంగంలో రంగరాజన్‌ పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి...

► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశం ఏడు శాతం వృద్ధి సాధిస్తే, అది హర్షణీయమైన అంశమే.  
► ఆర్‌బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో (మే నుంచి 1.4 శాతం పెంపుతో ప్రస్తుతం 5.40 శాతం) పెంపు విధానాన్ని కొనసాగించాలి. అభివృద్ధి చెందిన దేశాలు సైతం రేట్ల పెంపు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మరిన్ని రేటు పెంపు చర్యలు కొనసాగుతాయని భావిస్తున్నా.
► దేశం నుంచి పెట్టుబడులు తరలిపోవడం వల్లే డాలర్‌ మారకంలో రూపాయి విలువ 79 నుంచి 80 శ్రేణిలో పతనమైంది. ఇప్పుడు తిరిగి పెట్టుబడులు పుంజుకుంటున్నాయి. దీనితో దేశీయ కరెన్సీ విలువ మళ్లీ బలోపేతం అవుతుందని భావిస్తున్నాం. పలు నెలలపాటు ఎడతెగని అమ్మకాల తర్వాత, ఆగస్టు 2022లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల నుంచి రూ. 22,000 కోట్ల పెట్టుబడులు దేశంలోకి వచ్చాయి.  
► 27 నుంచి 28 శాతానికి పడిపోయిన పెట్టుబడులు రేటు 33 శాతానికి పెరగాల్సిన అవసరం ఉంది. మొత్తం పెట్టుబడుల్లో ప్రైవేటు రంగం పెట్టుబడులు కూడా భారీగా పెరగాలి.  
► విద్యుత్, వ్యవసాయం, మార్కెటింగ్, కార్మిక వంటి కీలక రంగాల్లో సంస్కరణలు కొనసాగాలి. ఆర్థికాభివృద్ధిలో ఇది కీలకం. 1990లలో చేపట్టిన సంస్కరణ చర్యలు ‘మంచి సమన్వయంతో, విస్తృత ప్రాతిపదికన జరిగాయి.  
► దేశం మరింత పురోగతి సాధించడానికి కేంద్రం–రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం. వృద్ధి ప్రక్రియలో రెండు వర్గాలూ భాగాస్వాములే.  
► కొత్త టెక్నాలజీకి అనుగుణంగా సవాళ్లను, ఉపాధి కల్పనకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలి.

ఎలక్ట్రిక్‌ వాహనాలకు మారడం మంచిదే, కానీ...
శిలాజ ఇంధన వినియోగం తగ్గింపుతో ఎలక్ట్రిక్‌ వాహనాలకు మారడం ప్రయోజనకరంగా ఉంటుందని రంగరాజన్‌ పేర్కొన్నారు. అయితే దేశం ఈవీల కోసం ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని విశ్లేషించారు. దీనికితోడు ప్రస్తుత పరిస్థితులు, అంశాల ప్రాతిపదికన ఉపాధి రంగంపై ఈ తీవ్ర ప్రభావం వుండే వీలుందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ అభిప్రాయడ్డారు.   

మరిన్ని వార్తలు