వ్యాపారులకు అలర్ట్.. జనవరి 1 నుంచి కొత్త జీఎస్‌టీ రూల్స్..!

23 Dec, 2021 17:25 IST|Sakshi

పన్ను చెల్లింపు విషయంలో మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడం కోసం ప్రస్తుతం ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్‌టీ) చట్టంలో కొన్ని సవరణలను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం తీసుకొనిరాబోయే ఈ కొత్త నిబంధనలు జనవరి 1, 2022 నుండి అమల్లోకి వస్తాయి. ఆర్థిక చట్టం- 2021లో భాగంగా ప్రకటించిన ఈ సవరణలు పరోక్ష పన్నువిధానాన్ని మరింత కఠినతరం చేసే విధంగా ఉన్నాయి. ఈ మార్పులు ఈ ఏడాది ప్రారంభంలో పార్లమెంట్ ఆమోదించిన ఆర్థిక చట్టం- 2021లో భాగంగా ఉన్నాయి. 

ఈ మార్పులు పన్ను పరిధిలోకి వచ్చే ట్యాక్సబుల్ సప్లై, ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్‌లకు అర్హత, కొన్ని నిర్దిష్ట సందర్భాలలో అప్పీళ్లను దాఖలు చేసే నిబంధనలు వంటి అనేక సమస్యలను కవర్ చేస్తాయి. ఈ కొత్త సవరణలు వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేనప్పటికీ, వ్యాపారాలకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేయనుంది. ఈ కొత్త సవరణల ప్రకారం.. ఏ సంస్థ అయిన చేసే పన్ను చెల్లింపు, అమ్మకాల మధ్య  లెక్కలు సరిపోలకపోతే సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం అధికారులను పంపనుంది. ప్రస్తుత నిబంధన ప్రకారం.. కేవలం సంస్థలకు ముందుగా షో కాజ్ నోటీస్ జారీ చేయాల్సి ఉంటుంది.

(చదవండి: టూవీలర్‌ కొనుగోలుదారులకు మరోసారి భారీ షాక్‌..!)

జనవరి 1 నుంచి కొత్త జీఎస్‌టీ నిబంధనలు 
వార్షిక టర్నోవర్ రూ.5 కోట్లకు పైన గల కంపెనీ జిఎస్‌టిఆర్‌-1, జిఎస్‌టిఆర్‌-3బీ దాఖలు చేయాల్సి ఉంటుంది. జిఎస్‌టిఆర్‌-1 అనేది సేల్స్ ఇన్ వాయిస్ చూపించే రిటర్న్ అయితే, జిఎస్‌టిఆర్‌-3బీ అనేది జిఎస్‌టిఆర్‌-1లో చూపించిన రిటర్న్స్ కు సంబంధించి ప్రతి నెలా దాఖలు చేసే స్వీయ-ప్రకటిత జీఎస్‌టీ రిటర్న్.  ఒకవేల వ్యాపారాలు జిఎస్‌టిఆర్‌-1, జిఎస్‌టిఆర్‌-3 మధ్య సరిపోలకుండా రిటర్న్‌లు దాఖలు చేస్తే ఆ మేరకు జీఎస్‌టీని రికవరీ చేయడం కోసం పన్ను అధికారులను ఆ సంస్థలకు పంపే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కొత్త నియమం ప్రకారం.. రికవరీ కోసం ఎలాంటి నోటీస్ అందించాల్సిన అవసరం లేదు.

జీఎస్‌టీ ఫారాలను స్వతహగా సంస్థలే నింపడంతో, అందులో ఏమైన అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తిస్తే వెంటనే ఆ మొత్తాన్ని రికవరీ చేయడం కోసం అధికారులను నేరుగా నోటీసు లేకుండా పంపే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని పన్ను నిపుణులు సూచిస్తున్నారు. ముడి పదార్థాలు, వ్యాపారాలు సేకరించే ఇతర సేవలపై చెల్లించే పన్నులకు క్రెడిట్‌ల మంజూరును నియంత్రించే నిబంధనలను కఠినతరం చేస్తుంది. ఒక వస్తువు అమ్మేవారు తమ నెలవారీ అమ్మకాల రిటర్న్‌లో ఇన్‌వాయిస్ వివరాలను వెల్లడించకపోతే (ఫారమ్ జిఎస్‌టిఆర్‌-1లో), అప్పుడు కొనుగోలుదారు ఆ వస్తువుపై చెల్లించిన పన్నుల కోసం క్రెడిట్‌ను పొందలేరు.

(చదవండి: 2021లో విడుదలైన దిగ్గజ కంపెనీల టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..!)

>
మరిన్ని వార్తలు