TikTok: నేను మరీ అంత సోషల్‌ కాదు.. సీఈఓగా ఉండలేను

20 May, 2021 11:12 IST|Sakshi

బీజింగ్‌: చైనీస్‌ ప్రముఖ సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌ మాతృ సంస్థ బైట్‌డాన్స్‌ సహ వ్యవస్థాపకుడు జాంగ్‌ యిమింగ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను సంస్థకు సీఈఓగా ఉండబోనని గురువారం వెల్లడించారు. కంపెనీ మరో కో- ఫౌండర్‌ రూబో లియాంగ్‌ తన స్థానంలో బాధ్యతలు చేపడతారని, అధికార మార్పిడి సాఫీగా సాగేందుకు ఆరు నెలల పాటు రూబోతో కలిసి పనిచేస్తానని తెలిపారు. ఈ మేరకు.. ‘‘ఆదర్శవంతమైన మేనేజర్‌గా ఉండే నైపుణ్యాలు నాలో కొరవడ్డాయి అన్నది నిజం. నాకైతే మార్కెట్‌ విధానాల మీద, ఆర్గనైజేషనల్‌ ఎనాలసిస్‌ మీద ఆసక్తి.

నిజానికి మనుషులను మేనేజ్‌ చేయడం కంటే ఈ అంశాల మీద దృష్టి సారిస్తే మంచిదని భావిస్తాను. ఎందుకంటే నేను మరీ అంత కలివిడిగా ఉండే వ్యక్తి(సోషల్‌)ని కాదు. నన్ను నేను సంతోషంగా ఉంచుకోవడానికి ఆన్‌లైన్‌లో ఉండటం, పుస్తకాలు చదవడం, పాటలు వినడం చేస్తూ ఉంటా. రూబో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆరు నెలల పాటు తనతో కలిసి పనిచేస్తా’’ అని ఉద్యోగులను ఉద్దేశించి రాసిన మెమోలో జాంగ్‌ యిమింగ్‌ పేర్కొన్నారు. కాగా రూబో లియాంగ్‌ ఇంతకుముందు బైట్‌డాన్స్‌ హ్యూమన్‌ రీసోర్సెస్‌(మానవ వనరుల విభాగం)హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 

ఇక 2012లో ప్రారంభమైన బైట్‌డాన్స్‌ చైనాతో పాటు గ్లోబల్‌ మార్కెట్‌లోనూ హవా చూపింది. ముఖ్యంగా షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి చేరువైన ఈ సంస్థ అనతికాలంలోనే లాభాలను ఆర్జించింది. అయితే, జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా అమెరికా, భారత్‌ వంటి దేశాలు టిక్‌టాక్‌పై నిషేధం విధించడంతో భారీగా నష్టపోయిన ఈ కంపెనీ, పూర్వవైభవం పొందేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 

చదవండి: టీనేజ్‌ సంచలనం.. టిక్‌ టాక్‌ ఎటాక్‌

మరిన్ని వార్తలు