పోటీ కన్నా కస్టమర్లకే ప్రాధాన్యం

23 Oct, 2020 04:53 IST|Sakshi

వాల్‌మార్ట్‌ ఇండియా ఎస్‌వీపీ ఆదర్శ్‌ మీనన్‌

తిరుపతిలో 29వ స్టోర్‌ ప్రారంభం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఈ–కామర్స్‌లో ఇతర సంస్థలతో పోటీ కన్నా మెరుగైన సేవలందిస్తూ కస్టమర్లకు మరింత చేరువ కావడానికే ప్రాధాన్యమిస్తామని ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్, వాల్‌మార్ట్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆదర్శ్‌ మీనన్‌ తెలిపారు. కిరాణా, చిన్న.. మధ్య తరహా సంస్థలు, రైతులకు తోడ్పాటు అందించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. గురువారం తిరుపతిలో బెస్ట్‌ప్రైస్‌ స్టోర్‌ ప్రారంభం సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. దేశీయంగా ఇది 29వ బెస్ట్‌ప్రైస్‌ స్టోర్‌ కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇది ఆరోదని మీనన్‌ చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 10 బెస్ట్‌ప్రైస్‌ స్టోర్స్‌ ఉన్నాయని తెలిపారు. స్థానికంగా కొనుగోళ్లు జరపడం, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా స్థానిక ఎకానమీ వృద్ధికి తమ స్టోర్స్‌ ఇతోధికంగా తోడ్పడగలవని వివరించారు.

తిరుపతిలో కొత్త స్టోర్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగగలదని మీనన్‌ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఈ స్టోర్‌ను ప్రారంభించారు. సుమారు 56,000 చ.అ.ల విస్తీర్ణంలో ఇది ఏర్పాటైంది. ‘సులభతరంగా వ్యాపారాల నిర్వహణకు అనువైన పరిస్థితులు కల్పించే విషయంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంటోంది. ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌తో రాష్ట్రానికి దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయి. కొత్త స్టోర్‌తో తిరుపతిలో కొత్తగా ఉద్యోగాల కల్పన, ఇతరత్రా అవకాశాలు రాగలవు‘ అని రామచంద్రా రెడ్డి తెలిపారు. మరోవైపు, ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌ విభాగం సర్వీసులు 16 నగరాల్లో అందుబాటులో ఉన్నాయని మీనన్‌ చెప్పారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు