టైటన్‌- శ్రీ సిమెంట్‌... ఫలితాల దెబ్బ

11 Aug, 2020 10:52 IST|Sakshi

క్యూ1లో నికర నష్టం ప్రకటించిన టైటన్‌- షేరు 4 శాతం పతనం

కన్సాలిడేటెడ్‌ నికర లాభం 14 శాతం వీక్‌- శ్రీ సిమెంట్‌ 4 శాతం డౌన్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో రివర్స్‌ టర్న్‌అరౌండ్‌ ఫలితాలు ప్రకటించడంతో టాటా గ్రూప్‌ కంపెనీ టైటన్‌ కంపెనీ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇదే కాలంలో పనితీరు నిరాశపరచడంతో శ్రీ సిమెంట్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ సైతం బలహీనపడింది. దీంతో రెండు కౌంటర్లలోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడుతున్నారు. ఫలితంగా ఈ రెండు కౌంటర్లూ నష్టాల బాటలో సాగుతున్నాయి. ఇతర వివరాలు చూద్దాం..

టైటన్‌ కంపెనీ
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌- జూన్‌)లో డైవర్సిఫైడ్‌ దిగ్గజం టైటన్‌ రూ. 297 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 364 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 61 శాతం క్షీణించి రూ. 1979 కోట్లకు పరిమితమైంది. పన్నుకు ముందు రూ. 361 కోట్ల నష్టం నమోదైంది. గత క్యూ1లో ఈ పద్దుకింద రూ. 520 కోట్ల లాభం సాధించింది. ఈ నేపథ్యంలో టైటన్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 4 శాతం పతనమై రూ. 1063 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1049 దిగువకు చేరింది.

శ్రీ సిమెంట్‌ లిమిటెడ్
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌- జూన్‌)లో ప్రయివేట్‌ రంగ దిగ్గజం శ్రీ సిమెంట్‌ 14 శాతం తక్కువగా రూ. 330 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 25 శాతం క్షీణించి రూ. 2480 కోట్లకు పరిమితమైంది. పన్నుకు ముందు లాభం 12 శాతం వెనకడుగుతో రూ. 443 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో శ్రీ సిమెంట్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 4 శాతం నష్టపోయింది. ప్రస్తుతం రూ. 21,530 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 21,322 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.

మరిన్ని వార్తలు