టైటాన్‌ నికర లాభం 38% డౌన్‌

29 Oct, 2020 05:34 IST|Sakshi

న్యూఢిల్లీ: టాటా గ్రూపునకు చెందిన టైటాన్‌కు అధిక వ్యయాల సెగ తగిలింది. ఈ ఆర్థిక సంవ త్సరం రెండో త్రైమాసికం (2020–21, క్యూ2)లో కంపెనీ స్టాండెలోన్‌ నికర లాభం 38 శాతం క్షీణించి రూ.199 కోట్లకు పడిపోయింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.320 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం సైతం 1.72 శాతం తగ్గుదలతో రూ.4,466 కోట్ల నుంచి రూ.4,389 కోట్లకు చేరింది. క్యూ2లో కంపెనీ మొత్తం వ్యయాల్లో భాగంగా రూ.480 కోట్లను నష్టంగా గుర్తించింది.

కంపెనీ మొత్తం వ్యయాలు రూ.4,151 కోట్లకు ఎగబాకాయి. క్రితం ఏడాది క్యూ2లో మొత్తం వ్యయాలు రూ.4,037 కోట్లుగా ఉన్నాయి. భారత్‌లో కోవిడ్‌–19 మహమ్మారి కారణంగా 2020–21 తొలి త్రైమాసికంలో నెలకొన్న తీవ్ర సమస్యల తర్వాత రెండో త్రైమాసికంలో అమ్మకాలు భారీగా 89 శాతం మేర పుంజుకున్నాయని కంపెనీ పేర్కొంది.  ‘క్యూ2లో కంపెనీ చవిచూసిన రికవరీ పట్ల సంతృప్తి చెందుతున్నాం. పండుగ సీజన్‌లో వినియోగదారుల నుంచి సానుకూల సెంటిమెంట్‌ నెలకొనడం కంపెనీ మొత్తం విభాగాలన్నింటికీ శుభసూచకం. కీలక వ్యాపారాల్లో కంపెనీ మార్కెట్‌ వాటా పెంపు కొనసాగుతోంది. వ్యయాలు, పెట్టుబడులపై మరింత దృష్టిసారించడం, లాభాలు అదేవిధంగా నగదు ప్రవాహాలు మెరుగయ్యేందుకు దోహదం చేసింది’ అని కంపెనీ ఎండీ సి.కె. వెంకటరామన్‌ తెలిపారు.

► ఆభరణాల విభాగం ఆదాయం క్యూ2లో రూ.3,446 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.3,528 కోట్లతో పోలిస్తే 2 శాతం తగ్గింది. వాచీలు, వేరబుల్స్‌ వ్యాపార ఆదాయం 44 శాతం దిగజారి రూ.719 కోట్ల నుంచి రూ.400 కోట్లకు క్షీణించింది.
► కళ్లద్దాల వ్యాపారం ఆదాయం సైతం 39 శాతం క్షీణతతో రూ.154 కోట్ల నుంచి రూ.94 కోట్లకు పడిపోయింది.

ఫలితాల నేపథ్యంలో టైటాన్‌ షేరు బుధవారం బీఎస్‌ఈలో 1.2 శాతం నష్టంతో రూ.1,218 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు