ఆ రాష్ట్రంలో భారీగా ఆస్తిపన్ను పెంపు! ఈ నిబంధనలే కారణం ?

2 Apr, 2022 15:37 IST|Sakshi

తమిళనాడు సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఆ రాష్ట్రంలో ఆస్తి పన్నును పెంచబోత్నుట్టు ప్రకటించింది. ప్రతిపక్షాలతో పాటు మిత్ర పక్షం నుంచి విమర్శలు వస్తున్నా వెనక్కి తగ్గేది లేదంటోంది స్టాలిన్‌ ప్రభుత్వం. ఈ మేరకు ఆ రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ శనివారం న్యూఢిల్లీలో స్పష్టమైన ప్రకటన చేశారు.

తమిళనాడులో ఉన్న పురపాలక సంఘాల్లో ఆస్తి పన్ను భారీగా పెరగనుంది. ఆ రాష్ట్ర రాజధాని చెన్నై విషయాన్ని పరిశీలిస్తే... 600 చదరపు అడుగుల లోపు ఉన్న ఆస్తులపై 50 శాతం, 600ల నుంచి 1200 చదరపు అడుగుల స్థలంలో విస్తరించిన ఆస్తులపై 75 శాతం పన్ను, 1200 నుంచి 1800 చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో ఉన్న ఆస్తులపై వంద శాతం పన్ను పెరగబోతుంది. 1800 చదరపు అడుగులకు మించితే 150 శాతం పన్ను పెంచనున్నట్టు సమాచారం.

డీఎంకే సర్కారు తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష అన్నా డీఎంకేతో పాటు మిత్రపక్షం కాంగ్రెస్‌ కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. కరోనా కాటు, ద్రవ్యోల్బణం ఎఫెక్ట్‌, పెట్రోలు ధరల వాతలతో ప్రజలు ఉక్కిరిబిక్కరవుతున్న సమయంలో ఈ పన్ను పెంపు సరికాదంటున్నాయి.

పదిహేనో ఫైనాన్స్‌ కమీషన్‌ నిబంధనల ప్రకారం కేంద్రం నుంచి అధిక మొత్తంలో నిధులు రావాలంటే ఆస్తి పన్ను పెంచక తప్పడం లేదంటూ స్టాలిన్‌ ప్రభుత్వం చెబుతోంది. పన్నులు పెంచినప్పటికీ అవి బెంగళూరు, లక్నో, అహ్మాదాబాద్‌, ఇండోర్‌, అహ్మదాబాద్‌, ముంబై, కోల్‌కతా కంటే తక్కువగానే ఉంటాయని అక్కడి ప్రభుత్వం అంటోంది.  

చదవండి: జీఎస్‌టీ వసూళ్లు.. రికార్డ్‌

మరిన్ని వార్తలు