సామాన్యులకు షాక్.. భారీగా పెరగనున్న టమాటా ధరలు

26 Nov, 2021 18:19 IST|Sakshi

వంటగదిలోకి వెళ్లకమునుపే కూరగాయల ధరలు మంట పుట్టిస్తున్నాయి. టమాటా ధరలు అమాంతం పెరగడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు కూరగాయలు కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, టమాటా ధరలు ఇంకా రెండు నెలల పాటు పెరిగే అవకాశం ఉన్నట్లు క్రిసిల్ రీసెర్చ్ ఒక నివేదికలో తెలిపింది. వర్షాలు, దిగుమతి తగ్గడంతో టమాట ధరలకు రెక్కలు వచ్చాయి అని వివరించింది. టమాటా పండించే ప్రధాన ప్రాంతాలలో ఒకటైన కర్ణాటకలో పరిస్థితి చాలా "భయంకరంగా" ఉంది. ఆ రాష్ట్రం కూరగాయలను మహారాష్ట్ర నాసిక్ నుంచి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తుంది. 

అక్టోబర్-డిసెంబర్ కాలంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో టమాటా పంట చేతికి వస్తుంది. ఇప్పుడు సరిగ్గా సమయంలో అధిక వర్షాల కారణంగా పంటలు  దెబ్బతిన్నట్లు క్రిసిల్ రీసెర్చ్ తెలిపింది. నవంబర్ 25 నాటికి ధరలు 145 శాతం పెరిగాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో టమాటా పంట జనవరి వరకు మార్కెట్లకు చేరుకుంటుంది. అప్పటి వరకు టమోటా ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు  క్రిసిల్ రీసెర్చ్ పేర్కొంది.

ప్రస్తుతం టమాటా ధర హైదరాబాద్‌లో రూ.100కు చెరకుంది. ఇంకా మరో రెండు నెలల పాటు ధర 30 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉల్లిపాయ ధర కూడా మహారాష్ట్రలో కురిసిన అకాల వర్షాల కారణంగా 65 శాతం పెరగడానికి దారి తీసినట్లు నివేదిక తెలిపింది. అయితే, ఉల్లిపాయల ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

(చదవండి: ‘టమాటా కొనాలంటే.. పాన్ కార్డు కావాలి’)

మరిన్ని వార్తలు