సామాన్యుడిపై మరో పిడుగు, పాల ధర పెంపు

16 Aug, 2022 15:38 IST|Sakshi

ముంబై: అమూల్ లేదా గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్  తాజాగా పాల ధరలను పెంచేసింది.  లీటరుకు రెండు రూపాయల చొప్పున ధరలను పెంచింది. మదర్ డెయిరీ కూడా పాల ధరను లీటరుకు రూ.2 పెంచింది. రెండు కంపెనీల సవరించిన ధరలు రేపటి నుంచి (బుధవారం, ఆగస్టు 17) అమలులోకి రానున్నాయి. పలితంగా  ఇప్పటికే కూరగాయలు, ఇంధనధరలతో అష్టకష్టాలుపడుతున్న సామాన్యుడి నెత్తిన మరో పిడుగుపడినట్టైంది.

పాల ధరను రూ. 2 పెంచడం వల్ల ఎంఆర్‌పిలో 4 శాతం పెంపు ఉంటుందని అమూల్ తెలిపింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ ,సౌరాష్ట్ర మార్కెట్స్‌, ఢిల్లీ-ఎన్‌సిఆర్, పశ్చిమ బెంగాల్, ముంబైతోపాటు అమూల్ తాజా పాలను విక్రయించే అన్ని ఇతర మార్కెట్‌లలో  ఈ సవరించిన ధరలు అమల్లో ఉంటాయని  అమూల్‌ ఒక ప్రకటనలో తెలిపింది.  ఫలితంగా అమూల్ గోల్డ్ ధర 500 మి.లీ రూ. 31, అమూల్ తాజా 500 మి.లీ రూ. 25, అమూల్ శక్తి 500 మి.లీ ధర రూ. 28లు చెల్లించాల్సి ఉంటుంది.

ఇక మదర్ డెయిరీకి సంబంధించి, ఫుల్‌క్రీమ్ మిల్క్‌పై లీటరుకు రూ.59 ఉండగా, బుధవారం నుంచి రూ.61కి చేరింది. టోన్డ్ మిల్క్ ధరలు రూ.51కిపెరగనుండగా, డబుల్ టోన్డ్ మిల్క్ ధర లీటరుకు రూ.45గా ఉండనుంది. ఆవు పాల ధర లీటరుకు రూ.53 కి పెరిగింది. 

మొత్తం నిర్వహణ వ్యయం , ఉత్పత్తి ఖర్చులు  పెరుగుదల కారణంగా ఈ ధరల పెంపు జరిగింది. గత ఏడాదితో పోలిస్తే కేవలం పశువుల దాణా ఖర్చు దాదాపు 20 శాతానికి పెరిగింది. ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే, తబ సభ్య సంఘాలు కూడా గత ఏడాది కంటే రైతుల ధరలను 8-9 శాతం వరకు పెంచాయని అమూల్‌ తెలిపింది. 
 

మరిన్ని వార్తలు