కార్ల మార్కెట్లో ఆ 5 కంపెనీలదే హవా

11 Dec, 2020 14:03 IST|Sakshi

ప్రపంచంలో నాలుగో పెద్ద మార్కెట్‌.. భారత్

‌దేశీయంగా అమ్మకాల్లో 85 శాతం మార్కెట్‌ వాటా

జాబితాలో మారుతీ, హ్యుండాయ్‌, టాటా మోటార్స్‌

కియా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా

పలు దేశాలలో టాప్‌ 5 కంపెనీల వాటా 50 శాతమే

ముంబై, సాక్షి: దేశీయంగా కార్ల విక్రయాలలో మెజారిటీ వాటాను 5 కంపెనీలు ఆక్రమిస్తున్నట్లు ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ సమాఖ్య(ఎఫ్‌ఏడీఏ) తాజాగా పేర్కొంది. దీంతో ప్యాసింజర్ వాహన మార్కెట్లో 85 శాతం వాటా వీటి సొంతంకాగా.. మరో 22 బ్రాండ్లు మిగిలిన 15 శాతం మార్కెట్లను పంచుకుంటున్నట్లు తెలియజేసింది. మారుతీ సుజుకీ, హ్యుండాయ్‌, టాటా మోటార్స్‌, కియా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా ప్రధాన వాటాను గెలుచుకున్నట్లు పేర్కొంది. (ఫేస్‌బుక్‌ నుంచి విడిగా వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌?) 
 
పెద్ద మార్కెట్‌
గత నవంబర్‌ నుంచి చూస్తే ఈ నవంబర్‌ వరకూ టాప్‌-5 కంపెనీలు తమ మార్కెట్‌ వాటాను 4.5 శాతంమేర పెంచుకున్నట్లు ఎఫ్‌ఏడీఏ తెలియజేసింది. దీంతో వీటి వాటా 81.2 శాతం నుంచి 85 శాతానికి ఎగసినట్లు వెల్లడించింది. సుప్రసిద్ధ గ్లోబల్‌ బ్రాండ్లు రేనాల్ట్‌, ఫోర్డ్‌, హోండా, టయోటా, ఫోక్స్‌వ్యాగన్‌ తదితరాలు పోటీ పడుతున్నప్పటికీ దేశీయంగా పరిస్థితులు వేరని ఆటో రంగ నిపుణులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. భారత్‌.. ప్రపంచంలోనే నాలుగో పెద్ద ఆటోమోటివ్‌ మార్కెట్‌ కాగా.. చైనా తొలి స్థానాన్ని ఆక్రమిస్తోంది. చైనాలో టాప్‌-5 కార్ల కంపెనీల వాటా 40 శాతమే. జర్మనీలో సైతం 50 శాతమేకాగా.. యూఎస్‌లో టాప్‌-5 కంపెనీలు 68 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉన్నాయి. అయితే జపాన్‌లో కూడా టాప్‌-5 కంపెనీల వాటా అత్యధికంగా 81 శాతంగా నమోదవుతుండటం గమనార్హం! జపాన్‌లో మార్కెట్‌ లీటర్లు జపనీస్‌ కంపెనీలేకావడం విశేషం! పలు దేశాలలో ప్రాధాన్యత కలిగిన టయోటా వాటా దేశీయంగా 3 శాతానికి పరిమితమవుతున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.(డిస్నీప్లస్‌లో హాట్‌స్టార్‌.. హాట్‌హాట్‌)

మారుతీ జోరు
చౌక ధరల మోడళ్లు, ప్రాచుర్యం పొందిన బ్రాండ్లు, భారీ నెట్‌వర్క్‌ వంటి అంశాల కారణంగా మారుతీ సుజుకీ కార్లకు డిమాండ్‌ కొనసాగుతున్నట్లు ఆటో నిపుణులు చెబుతున్నారు. దీంతో మారుతీ 50 శాతం వాటాను ఆక్రమిస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది కాలంలో హ్యుండాయ్‌ మార్కెట్‌ వాటా స్వల్ప క్షీణతతో 17.74 శాతం నుంచి 16.21 శాతానికి చేరింది. ఇదే కాలంలో టాటా మోటార్స్‌ వాటా 4.84 శాతం నుంచి 7.5 శాతానికి ఎగసింది. ఇక కియా మోటార్స్‌ వాటా 3.78 శాతం నుంచి 6.28 శాతానికి జంప్‌చేసింది. 

ఆల్ట్రోజ్‌.. థార్‌..
పండుగల సీజన్‌, కొత్త మోడళ్ల విడుదల, లాయల్టీ బెనిఫిట్స్‌, చౌక వడ్డీ రేట్లు తదితర పలు అంశాలు కార్ల విక్రయాలపై ప్రభావాన్ని చూపుతుంటాయని విశ్లేషకులు వివరిస్తున్నారు. టాటా మోటార్స్‌కు ఆల్ట్రోజ్‌, ఎస్‌యూవీ నెక్సాన్‌ మోడళ్లు మద్దతుగా నిలిచినట్లు పేర్కొన్నారు. కాగా.. ఎంఅండ్‌ఎం వాటా 6.78 శాతం నుంచి 5.48 శాతానికి నీరసించింది. కంపెనీ విడుదల చేసిన థార్‌ ఎస్‌యూవీకి భారీ డిమాండ్‌ నెలకొన్నప్పటికీ తగిన స్థాయిలో వాహనాల తయారీ, సరఫరా చేయలేకపోవడం ప్రభావం చూపినట్లు ఆటో నిపుణులు తెలియజేశారు.

మరిన్ని వార్తలు