పండుగ సెంటిమెంట్‌, కార్లను తెగకొనేస్తున్నారు

2 Sep, 2021 08:07 IST|Sakshi

ముంబై: పండుగ సీజన్‌ సెంటిమెంట్‌ కలిసిరావడంతో ఆగస్టులో వాహన విక్రయాలు పెరిగాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, ఎంఅండ్‌ఎం,హోండా కంపెనీలు అమ్మకాల్లో స్థిరమైన వృద్ధిని కనబరిచాయి. చదవండి : ఫెస్టివల్‌ బొనాంజా ఆఫర్‌..సర్వీస్, ప్రాసెసింగ్‌ చార్జీల ఎత్తివేత

మారుతీ సుజుకీ మొత్తం అమ్మకాలు ఐదు శాతం పెరిగి 1,30,699 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే ఆగస్ట్‌లో 1,24,624 వాహనాలను విక్రయించింది. అయితే దేశీయ విక్రయాలు 6% తగ్గి 1,10,080 యూనిట్లకు పరిమితమైంది. అంతర్జాతీయంగా సెమికండెక్టర్ల కొరత ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని కంపెనీ తెలిపింది. ఇదే నెలలో హ్యుందాయ్‌ మోటార్‌ 12 శాతం వృద్ధిని సాధించి మొత్తం 59,068 వాహనాలను విక్రయించింది.

గతేడాది ఆగస్టులో 35,420 యూనిట్లు అమ్మిన టాటా మోటార్స్‌.., ఈ ఆగస్టులో 53 శాతం వృద్ధిని సాధించి 54,190 వాహనాలను విక్రయించింది. మహీంద్రా అండ్‌ మహీంద్రా అమ్మకాలు 17 శాతం పెరిగి 15,973 యూనిట్లు అమ్ముడైనట్లు కంపెనీ ప్రకటించింది. థార్, ఎక్స్‌యూవీ 300, బోలెరో నియో, బొలెరో పిక్‌–అప్‌ కార్ల బుకింగ్స్‌ కలిసొచ్చాయని ఎంఅండ్‌ఎం కంపెనీ సీఈఓ విజయ్‌ నాక్రా తెలిపారు. కియా మోటార్స్‌ ఇండియా వాహన విక్రయాలు 55 శాతం వృద్ధిని సాధించి మొత్తం 16,750 యూనిట్ల అమ్మింది. గతేడాదిలో ఇదే నెలలో  విక్రయాలు 10,845 యూనిట్లు.

‘‘ఆటో కంపెనీలు పండుగ సీజన్‌ను స్థిరమైన విక్రయాలతో ప్రారంభించాయి. రానున్న రోజుల్లో కస్టమర్ల నుంచి బుక్సింగ్‌ మరింత పెరగవచ్చు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సెమికండక్టర్ల కొరత ఉత్పత్తిపై ప్రభావాన్ని చూపుతున్న వేళ డిమాండ్‌కు తగ్గట్లు వాహనాలను అందుబాటులో ఉంచడం ఆటో పరిశ్రమకు సవాలుగా మారవచ్చు’’ అని నిస్సాన్‌ మోటార్‌ ఎండీ రాకేష్‌ శ్రీవాస్తవ తెలిపారు.

>
మరిన్ని వార్తలు