గడ్డ కట్టే చలి..బైక్‌ స్టార్ట్‌ అవ్వడం లేదా..! అయితే ఈ జాగ్రత్తలను పాటించండి..!

26 Jan, 2022 13:02 IST|Sakshi

చలికాలం వచ్చిందంటే చాలు.. అటు ఆరోగ్య, చర్మ సమస్యలతో పాటు.. ఇతర సమస్యలు కూడా ఇబ్బంది పెడుతుంటాయి. పైగా గత కొద్ది రోజుల నుంచి చలి మరింత తీవ్రమైంది.  ఈ సీజన్ లో పొద్దున్నే లేచి ఏదైనా పని కోసం బయటకు వెళ్లాలని బైక్‌ స్టార్ట్ చేస్తే తొందరగా స్టార్ట్ కాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ గడ్డ కట్టే చలిలో మీరు తీసుకున్న జాగ్రత్తలను మీ బైక్స్‌కు కూడా అందిస్తే పలు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తోంది. ఈ జాగ్రత్తలను పాటిస్తే మీ బైక్‌ మొరాయించకుండా సింపుల్‌గా స్టార్ట్‌ అవుతుంది. 

► మీ బైక్‌ను కవర్‌తో కప్పేయండి
తీవ్రమైన చలిని తట్టుకోవడం కోసం మీరు ఎలాగైతే స్వెటర్లు, జాకెట్లు ధరిస్తారో మీ మోటార్‌సైకిల్‌కు కవర్‌తో కప్పేయడం తప్పనిసరి. బయట పార్క్ చేసి ఉంటే కవర్‌తో కచ్చితంగా కప్పేయాలి. బైక్‌ ఎప్పుడూ తేమ లేకుండా ఉండేందుకు వాటర్‌ రిపెల్లెంట్‌ స్ప్రేస్‌ వాడితే బైక్‌ ఎప్పుడూ తేమ లేకుండా ఉంటాయి. 

► టైర్ల పట్ల అదనపు జాగ్రత్త అవసరం
శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు టైర్ ఒత్తిడిలో తగ్గుదలకి కారణమవుతాయి. కాబట్టి, మీరు బైక్‌ను రోడ్డుపైకి తీసుకెళ్లినప్పుడల్లా టైర్ ప్రెజర్‌ని చెక్ చేస్తూ ఉండాలి. 

► బ్యాటరీని జాగ్రత్తగా చూసుకోండి
ఆధునిక సీల్డ్ డ్రై బ్యాటరీలకు ఛార్జింగ్ తప్ప మరే ఇతర నిర్వహణ అవసరం లేదు. అయితే, పాత బ్యాటరీలకు కొన్ని అదనపు జాగ్రత్తలు అవసరం వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. తక్కువ ఉష్ణోగ్రత బ్యాటరీ స్నిగ్ధతను పెంచుతుంది. దీంతో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఫలితంగా బైక్ ఆలస్యంగా స్టార్ట్‌ అవుతుంది.దాంతో పాటుగా బ్యాటరీ టెర్మినల్స్ శుభ్రంగా ఉండేలా తనిఖీ చేయాలి.

► ఆయిల్‌ చేంజ్‌ చాలా ముఖ్యం
పాత ఇంజిన్‌ ఆయిల్‌ బైక్‌ ఇంజిన్‌ను ప్రభావితం చేస్తుంది. కాబట్టి, నిర్ణీత సమయంలో ఎప్పటికప్పుడు ఆయిల్‌ మార్చడం మంచింది.

► స్పార్క్‌ ప్లగ్‌ చెక్‌ చేయండి
బైక్‌ అసలు స్టార్ట్‌ కాకపోతే వెంటనే ఒకసారి స్పార్క్‌ ప్లగ్‌ తీసి శుభ్రం చేయాలి. బైక్‌ను స్టార్ట్‌ చేసేటప్పుడు చోక్‌ ఆన్‌ చేసి స్టార్ట్‌ చేస్తే వెంటనే స్టార్ట్‌ అవుతుంది. 

► చైన్, ఇతర కదిలే భాగాలను లూబ్రికేట్ చేయండి
చైన్, ఇతర కదిలే భాగాలు మీ బైక్‌ లూబ్రికేషన్‌ సాఫీగా నడిచేలా చేస్తోంది. చలికాలంలో సరైనా లుబ్రికేషన్‌ లేకపోవడంతో బైక్‌లోని పలు భాగాలు తుప్పు పట్టే అవకాశం లేకపోలేదు. 

► వర్క్‌ ఫ్రమ్‌ హోంతో ఆఫీసులకు వెళ్లే పని అంతగా లేదు. దీంతో ఎక్కువగా బైక్‌ను బయటకు తీసే పని ఉండకపోవచ్చును. బైక్‌ను మూలన పడేయకుండా బైక్‌ను రెండు మూడు రోజుల కొకసారి ఆన్‌ చేస్తూ ఉండడం ఉత్తమం. 

చదవండి:  సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోన్న ఓలా ఎలక్ట్రిక్‌ కారు..!

మరిన్ని వార్తలు