టొరంట్‌ ఫార్మా చేతికి క్యురేషియో: ఏకంగా 2వేలకోట్లు

28 Sep, 2022 11:53 IST|Sakshi

డెర్మటాలజీ, కాస్మెటిక్‌ బ్రాండ్ల కంపెనీ 

ఒప్పందం విలువ రూ. 2,000 కోట్లు

న్యూఢిల్లీ: చర్మ పరిరక్షణ(డెర్మటాలజీ) విభాగంలో సేవలందిస్తున్న క్యురేషియో హెల్త్‌కేర్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రయివేట్‌ రంగ కంపెనీ టొరంట్‌ ఫార్మాస్యూటికల్స్‌ పేర్కొంది. ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. డీల్‌ విలువను రూ. 2,000 కోట్లుగా వెల్లడించింది. దీనిలో భాగంగా ఒప్పందంపై సంతకాలు చేసిన రోజున రూ. 115 కోట్లను నగదు రూపేణా చెల్లించనున్నట్లు తెలియజేసింది. వెరసి రూ. 1,885 కోట్ల ఎంటర్‌ప్రైజ్‌ విలువలో ఒప్పందం కుదిరినట్లు వివరించింది. కాగా.. క్యురేషియోను సొంతం చేసుకోవడం ద్వారా డెర్మటాలజీ పోర్ట్‌ఫోలియోను విభిన్నంగా విస్తరించేందుకు వీలు చిక్కనున్నట్లు టొరంట్‌ ఫార్మా డైరెక్టర్‌ అమన్‌ మెహతా తెలియజేశారు. ఇది వ్యూహాత్మక కొనుగోలుగా పేర్కొన్నారు.   

50 బ్రాండ్లకుపైగా: చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న క్యురేషియో కాస్మెటిక్, పిడియాట్రిక్‌ డెర్మటాలజీ విభాగాలలో అధిక మార్కెట్‌ వాటాను కలిగి ఉన్నట్లు వెల్లడించారు. టెడిబార్, అటోగ్లా, స్పూ, బీ4 నప్పి, పెర్మైట్‌ తదితర 50 బ్రాండ్లకుపైగా పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్నట్లు తెలియజేశారు. గతేడాది(2021–22)లో రూ. 224 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. క్యురేషియో ప్రమోటర్లతోపాటు.. క్రిస్‌క్యాపిటల్, సీక్వోయా సైతం కంపెనీ నుంచి వైదొలగనున్నట్లు ప్రస్తావించింది. 
 

మరిన్ని వార్తలు