దేశ చరిత్రలో రికార్డు.. ఎలక్ట్రిక్ వాహనాల జోరు తగ్గట్లేదుగా!

5 Dec, 2021 10:38 IST|Sakshi

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి. గత ఏడాది నవంబర్ 2020లో 12,858 యూనిట్లు, అక్టోబర్ 2021లో 38,715 యూనిట్లతో పోలిస్తే నవంబర్ 2021 నెలలో సుమారు 42,067 యూనిట్ల రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు జరిగాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరందుకోవడంతో దిగ్గజ కంపెనీలు కూడా రంగంలోకి దిగాయి. మొత్తంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఒక నెలలో 40,000 మార్కును దాటడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. ఏప్రిల్-నవంబర్ 2021 కాలంలో మొత్తం 1.98 లక్షల-ప్లస్ యూనిట్లు అమ్ముడయ్యాయి. 
 
ఎలక్ట్రిక్ బైక్, స్కూటర్ల అమ్మకాలు
పండుగ సీజన్ తర్వాత కూడా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల బూమ్ కొనసాగుతుంది. నవంబర్ నెలలో ఎలక్ట్రిక్ టూ వీలర్ అమ్మకాలు ఊపందుకోవడంతో మొత్తంగా ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు పెరిగాయి. 2020 నవంబరులో సుమారు 4,000 అమ్మకాలతో పోలిస్తే 2021 నవంబరులో నమోదైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఐదు రెట్లు పెరిగి 22,450 యూనిట్లగా ఉన్నాయి. సీఈఈఈ(కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్ మెంట్ అండ్ వాటర్) అందించిన వివరాల ప్రకారం నెల నెలా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 17 శాతం పెరుగుతున్నాయి. హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్, అథర్, ప్యూర్ ఈవీ వంటి ప్రముఖ ఎలక్ట్రిక్ కంపెనీలు భారీగా వృద్దిని నమోదు చేశాయి.

(చదవండి: ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు కొన్నవారికి గుడ్‌న్యూస్‌..!)

దేశంలో భారీగా పెరుగుతున్న ఇంధన ధరల వల్ల ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు వైపు మొగ్గు చూపారు. ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ లీడర్ హీరో ఎలక్ట్రిక్ ప్రతినిధి మాట్లాడుతూ.. గత ఏడాది ఇదే కాలంలో 11,339 యూనిట్లతో పోలిస్తే అక్టోబర్ 1 నుంచి నవంబర్ 15, 2021 కాలంలో 24,000 ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మినట్లు పేర్కొంది. అథర్ అమ్మకాలు కూడా గత ఏడాది నవంబర్ నెల అమ్మకాలతో పోలిస్తే 20 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఒక పక్క ఇప్పటికే ఉన్న ఎలక్ట్రిక్ కంపెనీల అమ్మకాల పెరుగుతుండటం, మరోపక్క కొత్త కంపెనీలు రంగ ప్రవేశం చేయడంతో ఈవీ వాహన అమ్మకాలు జోరందుకున్నాయి. ఇంకా రానున్న రోజుల్లో భారీగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జరుగుతాయని మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు.

ఎలక్ట్రిక్ ఆటో, కార్ల అమ్మకాలు
నవంబర్ నెలలో రిజిస్టర్డ్ త్రి వీలర్(ప్యాసింజర్, కార్గో టైప్ రెండూ) అమ్మకాలు 18,011 యూనిట్లుగా ఉన్నాయి, అక్టోబర్ 2021 రిజిస్ట్రేషన్ల కంటే కేవలం 7 యూనిట్లు మాత్రమే పెరిగాయి. ప్యాసింజర్ ఈ3డబ్ల్యు అమ్మకాలు దాదాపు అలాగే ఉండగా, కార్గో ఈ3డబ్ల్యు అమ్మకాలు గత నెల అమ్మకాలు 2 శాతం పడిపోయాయని జేఎంకే రీసెర్చ్ తెలిపింది. నవంబర్ నెలలో ఎలక్ట్రిక్ కార్ల మొత్తం అమ్మకాలు 1,539 యూనిట్లుగా ఉన్నాయి. టాటా మోటార్స్, ఎంజి మోటార్స్ ఈ-కార్ల అమ్మకాలలో తమ సత్తా చాటుతున్నాయి. టాటా మోటార్స్ వాటా గత నెల 80 శాతంతో పోలిస్తే 89 శాతానికి పెరిగింది.

(చదవండి: 2021లో తెగ వాడేసిన ఎమోజీ ఇదేనండోయ్‌..!)

మరిన్ని వార్తలు