మాకూ పీఎల్‌ఐ స్కీమ్‌ ఇవ్వండి : టోయ్స్‌ పరిశ్రమ

17 Sep, 2022 12:40 IST|Sakshi

 ఎగుమతి ప్రోత్సాహక మండలి ఏర్పాటు చేయండి

టాయ్స్‌ పరిశ్రమ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాన్ని తమకూ వర్తింపచేయాలని, ప్రత్యేకంగా ఎగుమతి ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేయాలని ఆట వస్తువుల పరిశ్రమ వర్గాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఉద్యోగాల కల్పనకు, ఎగుమతులను పెంచేందుకు ఇవి దోహదపడగలవని పేర్కొన్నాయి. ఇటు దేశీయంగా తయారీకి, అటు ఎగుమతులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు ఉద్దేశించిన పీఎల్‌ఐ స్కీము ప్రస్తుతం ఫార్మా తదితర 14 రంగాలకు వర్తిస్తోంది. ఈ నేపథ్యంలో టాయ్స్‌ పరిశ్రమ విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది. (Hero Motocorp: విడా ఈవీ: తొలి మోడల్‌ కమింగ్‌ సూన్‌)

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పరిశ్రమకు సహాయకరంగా ఉంటున్నప్పటికీ పీఎల్‌ఐ స్కీము, ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఏర్పాటు చేస్తే మరింత తోడ్పాటు లభించగలదని లిటిల్‌ జీనియస్‌ టాయ్స్‌ సీఈవో నరేశ్‌ కుమార్‌ గౌతమ్‌ చెప్పారు. అలాగే పరిశ్రమ భవిష్యత్‌ వృద్ధికి దిశా నిర్దేశం చేసేలా ప్రభుత్వం జాతీయ టాయ్‌ పాలసీ రూపొందించే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆయన కోరారు. మరోవైపు, ప్రస్తుతం టాయ్స్‌ పరిశ్రమను హస్తకళలు లేదా క్రీడా వస్తువుల కింద వర్గీకరిస్తున్నారని అలా కాకుండా దీని కోసం ప్రత్యేకంగా ఎగుమతి మండలిని ఏర్పాటు చేస్తే మరింత ప్రాధాన్యం దక్కేందుకు అవకాశం ఉంటుందని నట్‌ఖట్‌ టాయ్స్‌ ప్రమోటర్‌ తరుణ్‌ చేత్వాని అభిప్రాయపడ్డారు. ఎగుమతులకు భారీ అవకాశాలు ఉన్నాయని, పరిశ్రమ ప్రస్తతుం తయారీపై దృష్టి పెడుతుండటంతో చైనా వంటి దేశాల నుంచి దిగుమతులు గణనీయంగా తగ్గాయని వివరించారు.  

ఎగుమతులు 61 శాతం అప్‌.. 
గడిచిన మూడేళ్లలో ఆటవస్తువుల ఎగుమతులు 61 శాతం పెరిగాయని ప్లేగ్రో టాయ్స్‌ ఇండియా ప్రమోటర్‌ మను గుప్తా తెలిపారు. ఇవి 2018–19లో 202 మిలియన్‌ డాలర్లుగా ఉండగా 2021–22లో 326 మిలియన్‌ డాలర్లకు చేరాయని వివరించారు. మరోవైపు గత మూడేళ్లలో దిగుమతులు 70 శాతం తగ్గాయని, 371 మిలియన్‌ డాలర్ల నుంచి 110 మిలియన్‌ డాలర్లకు దిగి వచ్చాయని వాణిజ్య శాఖ గణాంకాలను ఉటంకిస్తూ పేర్కొన్నారు. చాలా మటుకు దిగుమతిదారులు దిగుమతులను తగ్గించుకుని, స్థానికంగా ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక చర్యలు సహాయపడుతున్నాయని చెప్పారు.  

మరిన్ని వార్తలు