ఇక దేశీయ రోడ్ల మీద చక్కర్లు కొట్టనున్న హైడ్రోజన్‌ కార్లు..!

15 Mar, 2022 20:14 IST|Sakshi

న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్‌తో కూడా కొద్దోగొప్పో కాలుష్యం సమస్య ఉంటుందేమోగానీ.. హైడ్రోజన్‌తో మాత్రం అస్సలు ఉండదు. ఈ విషయం చాలాకాలంగా మనందరికీ తెలుసు. అయితే, మనం ఇప్పుడు దీని గురించి ఎందుకు తెలుసుకుంటున్నాము అంటే. ఇప్పటికే రోడ్ల మీద పెట్రోల్, డీజిల్, సీఎన్'జీ, ఎలక్ట్రిక్ కార్లు తిరుగుతున్నాయి. త్వరలో హైడ్రోజన్‌తో నడిచే కార్లు కూడా దర్శనం ఇవ్వనున్నాయి.

తాజాగా టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రయివేట్ లిమిటెడ్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ(ఐసీఏటీ) భారతీయ రోడ్లు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నడిచే హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్‌ ఎలక్ట్రిక్ వెహికల్ టయోటా మిరాయ్ కారును మన దేశంలో పరీక్షించనున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రేపు(మార్చి 16) ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఇది. దేశంలో ఫ్యూయెల్ సెల్‌ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ గురించి అవగాహన పెంచడం కోసం ఈ పైలట్ ప్రాజెక్టు చేపట్టారు.

గత ఏడాది టయోటా కంపెనీకి చెందిన మిరాయ్ కారు హైడ్రోజన్ ఫ్యూయెల్'ని ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత అత్యధిక దూరం ప్రయాణించి ఏకంగా 'గిన్నిస్ వరల్డ్ రికార్డ్' కైవసం చేసుకుంది. ఈ విధమైన అత్యధిక మైలేజ్ అందించిన మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ కారు ఇదే. కొన్ని నివేదికల ప్రకారం.. హైడ్రోజన్ ఫ్యూయెల్'ని ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత 1,359 కిమీల దూరం ప్రయాణించింది. ఈ మొత్తం దూరం ప్రయాణించడానికి 5.65 కిలోగ్రాముల హైడ్రోజన్‌ను వినియోగించింది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో విద్యుత్ ఉత్పత్తి చేసే గ్రీన్ హైడ్రోజన్‌ 1 కేజీ ధర రూ.350-400 వరకు ఉంది.

(చదవండి: రష్యా-ఉక్రెయిన్‌ వార్‌... భారత్‌కు ఇదే గోల్డెన్‌ ఛాన్స్‌..! అమెరికాకు చెక్‌..!)

మరిన్ని వార్తలు