టయోటా దూకుడు.. లైనప్‌లో 30 ఎలక్ట్రిక్‌ మోడళ్లు

15 Dec, 2021 08:49 IST|Sakshi

గ్లోబల్‌ ఆటో దిగ్గజం టయోటా వెల్లడి 

2030కల్లా 30 ఎలక్ట్రిక్‌ వాహన మోడళ్లు 

3.5 మిలియన్‌ వాహనాల విక్రయ లక్ష్యం 

టోక్యో: భవిష్యత్‌లో మరిన్ని ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు జపనీస్‌ ఆటో దిగ్గజం టయోటా మోటార్‌ కార్పొరేషన్‌ తాజాగా వెల్లడించింది. 2030కల్లా 30 పూర్తిస్థాయి ఎలక్ట్రిక్‌ మోడళ్లను ఆవిష్కరించనున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్‌ అకియో టయోడా పేర్కొన్నారు. అంతర్జాతీయంగా పదేళ్ల కాలంలో 3.5 మిలియన్‌ ఈవీలను విక్రయించాలని కంపెనీ ప్రణాళికలు వేసినట్లు తెలియజేశారు. తొలుత వేసిన 2 మిలియన్‌ వాహనాలతో పోలిస్తే లక్ష్యాన్ని పెంచినట్లు తెలియజేశారు. బియాండ్‌ జీరో(బీజెడ్‌) సిరీస్‌ పేరుతో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్‌ మోడళ్ల తయారీకి తెరతీసినట్లు టయోడా వెల్లడించారు. తద్వారా మరికొన్నేళ్లలో అన్ని రకాల ఎస్‌యూవీ, పికప్‌ ట్రక్కులు, స్పోర్ట్స్‌ కార్లను ఈవీ మోడళ్లలో రూపొందించనున్నట్లు వివరించారు. 

లెక్సస్‌ లగ్జరీపై దృష్టి 
ప్రియస్‌ హైబ్రిడ్, లెక్సస్‌ లగ్జరీ మోడళ్లతోపాటు.. మిరాయి ఫ్యూయల్‌ సెల్‌ కారును రూపొందించిన కంపెనీ ఇకపై మరిన్ని వేరియంట్లను విడుదల చేయనున్నుట్లు వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో 2035కల్లా లెక్సస్‌ లగ్జరీ బ్రాండును పూర్తిఎలక్ట్రిక్‌గా అందించనున్నట్లు తెలియజేశారు. ఈ బాటలో 2030కల్లా వీటిని యూఎస్, యూరోపియన్, చైనీస్‌ మార్కెట్లలో ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. బ్యాటరీ అభివృద్ధి కోసం ఈ ఏడాది మొదట్లో ప్రకటించిన 13.2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను తాజాగా 17.6 బిలియన్‌ డాలర్లకు పెంచుతున్నట్లు ఈ సందర్భంగా కంపెనీ వెల్లడించింది. హైబ్రిడ్స్‌ తదితర గ్రీన్‌ టెక్నాలజీలపై కంపెనీ మొత్తం 70 బిలియన్‌ డాలర్లను వెచ్చించనున్నట్లు తెలియజేసింది. 
చదవండి: బీఎండబ్ల్యూ ఐఎక్స్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ

మరిన్ని వార్తలు