ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ తయారీ, టయోటా వేలకోట్ల పెట్టుబడులు!

9 May, 2022 19:09 IST|Sakshi

న్యూఢిల్లీ: విద్యుత్‌ వాహనాల పరికరాలు, పవర్‌ట్రెయిన్‌ విడిభాగాలు మొదలైన వాటిని దేశీయంగా తయారు చేయడంపై టయోటా గ్రూప్‌ సంస్థలు దృష్టి పెట్టాయి. ఇందుకోసం రూ. 4,800 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నాయి. ఇందులో టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌ (టీకేఎం), టయోటా కిర్లోస్కర్‌ ఆటో పార్ట్స్‌ (టీకేఏపీ) కలిసి రూ. 4,100 కోట్లు, మరో అనుబంధ సంస్థ టయోటా ఇండస్ట్రీస్‌ ఇంజిన్‌ ఇండియా (టీఐఈఐ) రూ. 700 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. 

దీని కోసం కర్ణాటక ప్రభుత్వంతో టీకేఎం, టీకేఏపీ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. స్థానికత, పర్యావరణ హిత ఉత్పత్తులకు పెద్ద పీట వేసే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీకేఎం ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ విక్రమ్‌ గులాటీ తెలిపారు. గ్రూప్‌ కంపెనీలు (టీకేఎం, టీకేఏపీ) ద్వారా ప్రత్యక్షంగా 3,500 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగగలదని, రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెరగగలదని ఆయన పేర్కొన్నారు.

సమీప భవిష్యత్తులోనే ఉత్పత్తి ప్రారంభించగలమని గులాటీ వివరించారు. టయోటా గ్రూప్‌ కంపెనీలు ఇప్పటికే రూ. 11,812 కోట్ల పైచిలుకు ఇన్వెస్ట్‌ చేశాయని, తమ సంస్థల్లో 8,000 మంది పైగా సిబ్బంది ఉన్నారని టీకేఎం వైస్‌–చైర్మన్‌ విక్రమ్‌ ఎస్‌ కిర్లోస్కర్‌ తెలిపారు. భారత్‌లో టయోటా కార్యకలాపాలు ప్రారంభించి పాతికేళ్లయింది.

మరిన్ని వార్తలు