టయోటా మోటార్స్ కీలక నిర్ణయం

15 Sep, 2020 15:18 IST|Sakshi

ఇకపై విస్తరణ ప్రణాళికలు లేవు, మార్కెట్లో  కొనసాగుతాం : టయోటా

పన్నుల  భారమే కారణం

భారీ పన్నుల ద్వారా మీరు వద్దనే సందేశం అందుతోంది

సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ కార్ల కంపెనీ టయోటా మోటార్ కార్పొరేషన్ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. దేశంలో ఆటో పరిశ్రమపై అధిక పన్నుల విధానం కారణంగా మరింత విస్తరించబోమని ప్రకటించింది.ఇక మీదట ఇండియాలో విస్తరణ ప్రణాళికలపై దృష్టి లేదనీ, అయితే మార్కెట్లో ప్రస్తుతం కొనసాగుతామని జపాన్ కు చెందిన టయోటా తెలిపింది. భారతీయ పన్నుల విధానం వల్ల కార్ల ఉత్పత్తి చేసినా డిమాండ్ లేదని ఈ నేపథ్యంలో ఇండియాలో ఇక పెట్టుబడులు పెట్టేది లేదని స్పష్టం చేసింది టయోటా. 

కార్లు, మోటారు బైకులపై ప్రభుత్వం పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయనీ దీంతో తమ ఉత్పత్తి దెబ్బతింటోందనీ, ఫలితంగా ఉద్యోగావకాశాలు పడిపోతున్నాయని టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్మన్ శేఖర్ విశ్వనాథన్ అన్నారు. భారీ పెట్టుబడుల తరువాత కూడా అధిక పన్నుల ద్వారా మిమ్మల్ని కోరుకోవడం లేదనే సందేశం అందుతోందని అని విశ్వనాథన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రధానంగా ఇన్నోవా, ఫార్చునర్ కార్లతో భారతీయ వినియోగదారులకు చేరువైన ప్రపంచంలోనే అతిపెద్ద నాలుగో కార్ల కంపెనీ టయోటా 1997లో ఇండియా మార్కెట్లోకి వచ్చింది.(సేల్స్‌ మరోసారి ఢమాల్‌, ఆందోళనలో పరిశ్రమ)

అతిపెద్ద మార్కెట్ భారత్ నుంచి ఇప్పటికే (2017లో) అమెరికాకు చెందిన జనరల్ మోటర్స్ వైదొలిగింది.ఫోర్డ్ కంపెనీ కూడా విస్తరణ ప్రణాళికలకు స్వస్తి చెప్పి మహీంద్రాలో జాయింట్ వెంచర్  గా కొనసాగుతోంది.  హార్లీ డేవిడ్ సన్ కూడా ఇదే బాటలో ఉన్నట్టు ఇటీవల నివేదికలు వెలువడ్డాయి.

భారతదేశంలో కార్లు, ద్విచక్ర వాహనాలు,  స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు సహా మోటారు వాహనాలపై 28 శాతం జీఎస్టీ  అమలవుతోంది. ఇంజిన్ సైజు, పొడుగు, లగ్జరీ  కేటగిరీ వారీగా 1 శాతం నుంచి 22 శాతం అదనపు పన్నులు భారం పడుతోంది. 1500 సీసీ ఇంజిన్తో పాటు, నాలుగుమీటర్ల పొడువు దాటిన ఎస్‌యూవీల దాదాపు 50శాతం వరకూ పన్నులు పడుతున్నాయని కంపెనీలు అంటున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు మినహాయింపు ఉంది. కరోనా సంక్షోభం కంటే ముందే ఆటో రంగం కుదేలైన సంగతి తెలిసిందే. అమ్మకాలు క్షీణించి, ఆదాయాలు లేక ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన ఆటో పరిశ్రమను కరోనా మరింత దెబ్బతీసింది. పలు కంపెనీలు దేశం నుంచి వైదొలగుతున్నాయి. ఈ మందగమనం నుంచి బయటపడేందుకు కనీసం నాలుగేళ్లు పడుందని అంచనా. అటు టయోటా తాజా నిర్ణయంతో మేకిన్ ఇన్ ఇండియాలో భాగంగా విదేశీ కంపెనీలను ఆకర్షించి,  భారీగా పెట్టుడులవైపు చూస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఇది ఎదురు దెబ్బేనని ఆటో రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఇలా  ఉంటే ఈ నెల 23న టయోటా అర్బన్ క్రూయిజర్ సబ్-4 ఎం ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ ను ఇప్పటికే ప్రారంభించింది. 

మరిన్ని వార్తలు