భారత్‌కు తగ్గనున్న చెల్లింపుల ఖాతా భారం

11 Aug, 2020 01:35 IST|Sakshi

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటన

ఆర్థిక వ్యవస్థలో వెలుగురేఖలు

న్యూఢిల్లీ:  చెల్లింపుల సమతౌల్యత (బీఓపీ) ఈ ఏడాది భారత్‌కు అనుకూలంగా పటిష్టంగా ఉండే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ సోమవారం తెలిపారు.  ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో వాణిజ్య లావాదేవీలకు ఒక దేశం... ఇతర దేశాలకు చెల్లించాల్సి వచ్చే మొత్తం వ్యవహారాలకు ఉద్దేశించిన అంశాన్నే చెల్లింపుల సమతౌల్యతగా పేర్కొంటారు. ఒకవైపు ఎగుమతులు మెరుగుపడుతుండడం, మరోవైపు తగ్గుతున్న దిగుమతులు భారత్‌కు చెల్లింపుల సమతౌల్యత సానుకూల పరిస్థితిని సృష్టిస్తున్నాయని అన్నారు. ఫిక్కీ వెబ్‌నార్‌ను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే...

► ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎగుమతుల విషయానికి వస్తే, చక్కటి రికవరీ జాడలు ఉన్నాయి.
 
► ఎగుమతులు క్షీణతలోనే ఉన్నా... ఆ క్షీణ రేటు తగ్గుతూ వస్తుండడం కొంత ఆశాజనకమైన అంశం. ఏప్రిల్‌లో ఎగుమతులు భారీగా మైనస్‌ 60.28 శాతం క్షీణిస్తే, మేలో ఈ రేటు మైనస్‌ 36.47 శాతానికి తగ్గింది. తాజా సమీక్షా నెల జూన్‌లో ఈ క్షీణ రేటు మరింతగా మైనస్‌ 12.41 శాతానికి తగ్గడం గమనార్హం.  

► 2019 ఎగుమతుల గణాంకాల పరిమాణంలో 91 శాతానికి 2020 జూలై ఎగుమతుల గణాంకాలు చేరాయి. దిగుమతుల విషయంలో ఈ మొత్తం దాదాపు 70 నుంచి 71 శాతంగా ఉంది. వెరసి ఈ ఏడాది భారత్‌ చెల్లింపుల సమతౌల్యం భారత్‌కు అనుకూలంగా ఉండనుంది.  

► భారత్‌ పారిశ్రామిక రంగానికి చక్కటి వృద్ధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని భావిస్తున్నా.  దేశీయ తయారీ, పారిశ్రామిక రంగానికి మద్దతు నివ్వడానికి ప్రభుత్వం తగిన అన్ని చర్యలూ తీసుకుంటోంది.

మరిన్ని వార్తలు