Sebi: ఇన్వెస్టర్ల ప్రయోజనం కోసమే టీప్లస్‌1

17 Sep, 2021 08:50 IST|Sakshi

న్యూఢిల్లీ: టీప్లస్‌1 సెటిల్‌మెంట్‌ (ట్రేడ్‌ ప్లస్‌ వన్‌) అన్నది మార్కెట్‌లోని భాగస్వాములు అందరి ప్రయోజనం కోసమేనని సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి అన్నారు. ట్రేడ్స్‌ను ముందుగా సెటిల్‌ చేయడం (విక్రయించిన వారికి నగదు చెల్లింపులు.. కొనుగోలు చేసిన వారికి షేర్ల జమ) అన్నది అందరికీ మంచి చేస్తుందన్నారు.

టీప్లస్‌1 సెటిల్‌మెంట్‌ను ఐచ్ఛికంగా అమలు చేసుకోవచ్చంటూ స్టాక్‌ ఎక్సేంజ్‌లకు సెబీ ఈ నెల ఆరంభంలో అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం టీప్లస్‌2 సెటిల్‌మెంట్‌ అమల్లో ఉంది. అంటే ట్రేడ్‌ (లావాదేవీ) జరిగిన తర్వాతి రెండు పనిదినాల్లో దాన్ని పరిష్కరిస్తారు. విక్రయించిన వారు నిధుల కోసం, కొనుగోలు చేసిన వారు షేర్ల జమ కోసం లావాదేవీ జరిగిన తర్వాతి రెండు రోజుల వరకు వేచి ఉండాల్సి వస్తుంది. టీప్లస్‌1లో లావాదేవీ తర్వాతి పనిదినం రోజునే అవి ముగిసిపోతాయి. దీనివల్ల విక్రయించిన వారికి తొందరగా నిధులు జమ అవుతాయి.

2002 లో టీప్లస్‌5 సెటిల్‌మెంట్‌ నుంచి సెబీ టీప్లస్‌3కు తగ్గించగా.. 2003లో టీప్లస్‌2కు కుదించింది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో, చెల్లింపుల వ్యవస్థల్లో ఎన్నో సంస్కరణలు వచ్చిన దృష్ట్యా దీన్ని టీప్లస్‌1కు తీసుకురావాల్సిన అవసరం ఉందని అజయ్‌త్యాగి అభిప్రాయపడ్డారు. కొనుగోలు చేసిన వాటిని వేగంగా పొందే హక్కు ఇన్వెస్టర్లకు ఉందన్నారు.  

ఇన్వెస్టర్ల ఇష్టం.. 
రెండు ఎక్సేంజ్‌లు భిన్నమైన సెటిల్‌మెంట్‌ సైకిల్స్‌ను ఎంపిక చేసుకుంటే లిక్విడిటీ సమస్య ఏర్పడదా? అన్న ప్రశ్నకు.. లిక్విడిటీ నిలిచిపోయేందుకు ఇది దారితీయదని బదులిచ్చారు. లిక్విడిటీ, ఖర్చులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఇన్వెస్టర్లు తమకు నచ్చిన చోట ట్రేడ్‌ చేసుకోవచ్చని సూచించారు. సెబీ టీప్లస్‌1ను ఇప్పుడు ఐచ్ఛికంగానే ప్రవేశపెట్టినా.. సమీప కాలంలో తప్పనిసరి చేయాలన్న ప్రణాళికతో ఉంది. టీప్లస్‌1పై విదేశీ ఇన్వెస్టర్ల ఆందోళనలను త్యాగి తోసిపుచ్చారు.

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు 1999 నుంచి డెరివేటివ్స్‌లో ట్రేడ్‌ చస్తున్నారని.. వీటికి ముందుగానే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అలాగే, ఐపీవోల్లో వారి పెట్టుబడులు సైతం ఏడు–ఎనిమిది రోజుల పాటు నిలిచిఉంటాయన్న విషయాన్ని గుర్తు చేశారు. తక్కువ కాల వ్యవధితో కూడిన సెటిల్‌మెంట్‌ ప్రతీ ఒక్కరికీ అవసరమేనని చెప్పారు. నూతన పీక్‌ మార్జిన్‌ నిబంధనలు అందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టినవేనని వివరణ ఇచ్చారు.

‘‘రిటైల్‌ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం పెరిగినందున.. అధిక మార్జిన్‌ నిబంధనలు ప్రశాంతను, అనుకోని సమస్యలకు దారితీయకుండా చూస్తాయి’’ అని పేర్కొన్నారు. పీక్‌మార్జిన్‌ నిబంధనల కింద బ్రోకర్లు ఇంట్రాడే ట్రేడ్స్‌కు సంబంధించి ఎక్కువ లెవరేజ్‌ (రుణ సర్దుబాటు) ఇవ్వడం ఇకమీదట కుదరదు.

బాండ్‌ మార్కెట్లో సంస్కరణలు 
బాండ్‌ మార్కెట్‌ బలోపేతానికి సంస్కరణలు పరిశీలనలో ఉన్నాయని అజయ్‌త్యాగి తెలిపారు. మార్కెట్‌ మేకర్స్‌ను ఏర్పాటు చేయ డం ఇందులో ఒకటిగా పేర్కొన్నారు. మార్కెట్‌ మేకర్స్‌ అనేవి సంస్థలు. సెకండరీ మార్కెట్లో కార్పొరేట్‌ బాండ్ల కొనుగోలు, విక్రయ ధరల ను కోట్‌ చేస్తూ లిక్విడిటీ ఉండేలా చూస్తాయి. కార్పొరేట్‌ బాండ్లకు రెపో కోసం లిమిటెడ్‌ పర్పస్‌ క్లియరింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు కూడా సంస్కరణల్లో ఒకటిగా త్యాగి తెలిపారు.

ప్రస్తుతం కార్పొరేట్‌బాండ్‌ మార్కె ట్లో 97–98 శాతం ప్రవేటు ప్లెస్‌మెంట్‌ మార్గం లో జారీ చేస్తున్నవే ఉంటున్నాయి. ఈ బాండ్ల సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ అంతగా ఉండ డం లేదు. మ్యూచువల్‌ ఫండ్స్‌ మాత్రమే ఎక్కు వగా పాల్గొంటున్నాయి. దీంతో ‘‘మరిన్ని బాం డ్ల పబ్లిక్‌ ఇష్యూలు రావాలి. సెకండరీ మార్కె ట్లో మరిన్ని సంస్థలు పాల్గొనడం ద్వారా లిక్విడిటీ పెరగాల్సి ఉంది’’ అని త్యాగి వివరించారు.  

చదవండి: డిగ్రీలో ఫెయిల్‌, నెమ్మదస్తుడు.. కానీ లక్ష కోట్లకు అధిపతి 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు