ఆన్‌లైన్‌ ఫార్మసీ విక్రయాలను నిషేధించాలి

8 Apr, 2022 06:45 IST|Sakshi

కేంద్రానికి  సీఏఐటీ డిమాండ్‌

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లు ఔషధాలను విక్రయించకుండా నిషేధం విధించాలని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) డిమాండ్‌ చేసింది. ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ‘ఫ్లిప్‌కార్ట్‌ హెల్త్‌ ప్లస్‌’ పేరుతో ఆన్‌లైన్‌ ఔషధ విక్రయాల్లోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించిన మరుసటి రోజే సీఏఐటీ ఈ డిమాండ్‌ చేయడం గమనార్హం. ఆన్‌లైన్‌లో ఔషధాలను విక్రయించే ఈ ఫార్మసీలను నిషేధించాలని కోరుతూ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయ ల్, ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు లేఖ రాశామని.. తక్షణమై దీనిపై దృష్టి సారించాలని కోరినట్టు ప్రకటించింది.

డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్స్‌ చట్టం (డీసీ) ఔషధాల దిగుమతులు, తయా రీ, విక్రయాలు, పంపిణీలను నియంత్రిస్తోందని.. ప్రజారోగ్యం, భద్రత దృష్ట్యా కఠిన నిబంధనలు చట్టంలో ఉన్నట్టు సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భారతీయ, కార్యదర్శి ప్రవీణ్‌ ఖండేల్‌వాల్‌ పేర్కొన్నారు.

లైసెన్స్‌ లేకుండా, ఒరిజినల్‌ డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌ లేకుండా ఔషధాలను విక్రయించడం, పంపిణీ చేయడం నిషేధమని గుర్తు చేశారు. భారతీయ చట్టాల్లోని మధ్యవర్తుల ముసుగులో కల్తీ, నకిలీ ఔషధాలను విక్రయించి బాధ్యత నుంచి తప్పించుకోకుండా ఈ ఫార్మసీలను నిషేధించాలని డిమాండ్‌ చేశారు. ఆఫ్‌లైన్‌ వర్తకులను దెబ్బతీసే విధంగా భా రీ తగ్గింపులు, దోపిడీ ధరలను అనుసరించే మార్కెట్‌ప్లేస్‌లను నిషేధించాలని కోరారు. కనీస పెనాల్టీని రూ.లక్ష నుంచి రూ.10 లక్షలకు పెంచాలని.. అప్పుడు ఫార్మ్‌ఈజీ, నెట్‌మెడ్స్, ఫ్లిప్‌కార్ట్, అమె జాన్‌ ఫార్మసీ, టాటా1ఎంజీ తదితర నిబంధనలను ఉల్లంఘిస్తున్నవారిని తగిన విధంగా శిక్షించడానికి వీలు పడుతుందని అభిప్రాయం తెలియజేశారు.

మరిన్ని వార్తలు