యూఎస్‌ఎస్‌డీ చార్జీల తొలగింపుపై ట్రాయ్‌ దృష్టి

25 Nov, 2021 08:53 IST|Sakshi

న్యూఢిల్లీ: డిజిటల్‌ లావాదేవీలను మరింత ప్రోత్సహించే దిశగా మొబైల్‌ బ్యాంకింగ్, చెల్లింపు సర్వీసులకు సంబంధించి యూఎస్‌ఎస్‌డీ మెసేజీలపై చార్జీలను తొలగించాలని భావిస్తున్నట్లు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ తెలిపింది. కేంద్ర ఆర్థిక సర్వీసుల విభాగం (డీఎఫ్‌ఎస్‌) విజ్ఞప్తి మేరకు ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు వివరించింది.

ప్రస్తుతం మొబైల్‌ బ్యాంకింగ్‌ విషయంలో ఒకో యూఎస్‌ఎస్‌డీ సెషన్‌కు టెలికం సంస్థలు విధిస్తున్న టారిఫ్‌లు .. ఒక నిమిషం అవుట్‌గోయింగ్‌ వాయిస్‌ కాల్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ సగటు కన్నా అనేక రెట్లు అధికంగా ఉంటున్నాయని ట్రాయ్‌ పేర్కొంది. ఈ ప్రతిపాదనపై డిసెంబర్‌ 8లోగా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుందని వివరించింది. ఉదాహరణకు, కాల్‌ చేసినప్పుడు లేదా ఎస్‌ఎంఎస్‌ పంపినప్పుడు మొబైల్‌ బ్యాలెన్స్‌ నుంచి ఎంత ఖర్చయ్యింది అన్నది స్క్రీన్‌పై కొంత సేపు చూపించి మాయమయ్యే మెసేజీలను యూఎస్‌ఎస్‌డీగా వ్యవహరిస్తారు. ఇవి ఎస్‌ఎంఎస్‌ల తరహాలో ఫోన్‌లో సేవ్‌ కావు. ప్రస్తుతం ఒకో యూఎస్‌ఎస్‌డీ సెషన్‌కు చార్జీలు గరిష్టంగా 50 పైసలుగా ఉన్నాయి. ట్రాయ్‌ ప్రతిపాదన ప్రకారం మొబైల్‌ బ్యాంకింగ్, చెల్లింపు సేవలకు మాత్రం చార్జీలు ఉండవు, కానీ ఇతర సర్వీసులకు మాత్రం అమల్లోనే ఉంటాయి.
 

చదవండి: శాటిలైట్‌ ఆపరేటర్ల నిబంధనలు సరళతరం కావాలి

మరిన్ని వార్తలు