టెలికం సంస్థల విమర్శలు..గట్టి కౌంటర్‌ ఇచ్చిన ట్రాయ్‌

21 Apr, 2022 12:16 IST|Sakshi

న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రం నిబంధనలపై టెల్కోల విమర్శల నేపథ్యంలో టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ తన సిఫార్సులను సమర్ధించుకుంది. ఇవి అంతర్జాతీయంగా పాటిస్తున్న ప్రమాణాలకు అనుగుణంగా, సహేతుకంగా, సరళతరంగా, సముచితంగానే ఉన్నాయని స్పష్టం చేసింది. కనీస సర్వీసుల కల్పన నిబంధన తిరోగామి చర్యగా టెల్కోలు వ్యాఖ్యానించడంపై ట్రాయ్‌ స్పందించింది.

ఇతర 5జీ మార్కెట్లలో కూడా ఇది అమల్లో ఉందని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. 5జీ ప్రయోజనాలు ఆపరేటర్లకు మాత్రమే కాకుండా కస్టమర్లకు కూడా అందేలా చూడాల్సిన బాధ్యత ట్రాయ్‌పై ఉందని ఆయన చెప్పారు. కనీస సర్వీసుల నిబంధనలు విధించకపోతే స్పెక్ట్రం వనరులను సమర్ధంగా ఉపయోగించుకోని పరిస్థితి తలెత్తుతుందని అధికారి వివరించారు.

5జీ సేవల వ్యాప్తికి నియమాలను నిర్దేశించే క్రమంలో అయిదేళ్లలో సగటున 4జీ సర్వీసుల విస్తరణను ట్రాయ్‌ పరిగణనలోకి తీసుకుందని ఆయన చెప్పారు. అందులో నాలుగో వంతు.. అది కూడా సర్కిళ్లను బట్టి వచ్చే 3–5 ఏళ్లలో అమలు చేయమంటోందని చెప్పారు. స్పెక్ట్రం ధర, ఇతర నిబంధనలను పునఃసమీక్షించాలన్న మొబైల్‌ ఆపరేటర్ల డిమాండ్లను ఆయన కొట్టిపారేశారు. సంపూర్ణ అధ్యయనంతో సహేతుకంగా చేసిన సిఫార్సులను ప్రకటించిన వారం రోజులకే మళ్లీ సమీక్షించే అవకాశమే ఉండదని పేర్కొన్నారు. సుమారు రూ. 7.5 లక్షల కోట్ల బేస్‌ ధరతో వివిధ బ్యాండ్లలో స్పెక్ట్రంను వేలం వేసేలా ట్రాయ్‌ ఈ నెల తొలినాళ్లలో సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.   

చదవండి: ప్రచారంలో పీక్స్‌.. మొబైల్‌ కొంటే పెట్రోల్‌, నిమ్మకాయలు ఉచితం

మరిన్ని వార్తలు