కేంద్రం కొత్త రూల్స్‌.. మే 1 నుంచి అమల్లోకి రానున్న ఫోన్‌ కాల్స్‌ నిబంధనలు!

28 Apr, 2023 15:09 IST|Sakshi

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లకు శుభవార్త చెప్పింది. మే నెల ప్రారంభం నుంచి కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపింది. దీంతో యూజర్లకు భారీ ఊరట లభించినట్లైంది. 

ట్రాయ్‌ ప్రకటనతో ఫోన్‌ వినియోగదారులు ఫేక్‌, ప్రమోషనల్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ల బారి నుంచి ఉపశమనం పొందనున్నారు. ఇందుకోసం ట్రాయ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాయం తీసుకోనుంది. తద్వారా యూజర్లను అస్తమానం చికాకు పెట్టించే కాల్స్‌, మెసేజ్‌ల బెడద తప్పనుంది.  

టెలికాం కంపెనీలకు ట్రాయ్‌ ఆదేశాలు 
ఇక స్పామ్‌ కాల్స్‌ బెడద నుంచి యూజర్లను రక్షించేలా టెలికాం కంపెనీలకు ట్రాయ్‌ ఆదేశాలు జారీ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎయిర్‌ టెల్‌, జియో, వివో వంటి సంస్థలు తప్పనిసరిగా ఏఐ ఫిల్టర్‌ను వినియోగించాలని ఆదేశించింది. దీని ద్వారా, ఫోన్‌లలోని ప్రమోషనల్‌ కాల్స్‌ ఫేక్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ల నుంచి బయటపడొచ్చు.  

ట్రాయ్‌ ఆదేశాలు.. ఎయిర్‌టెల్‌ , జియో అప్రమత్తం
​ఈ తరుణంలో ట్రాయ్‌ ఆదేశాలపై జియో, ఎయిర్‌టెల్‌ స్పందించాయి. ట్రాయ్‌ ఆదేశాలకు అనుగుణంగా త్వరలోనే తమ నెట్‌వర్క్‌లలో ఏఐ ఫిల్టర్‌ ఆప్షన్‌ను ఏనేబుల్‌ చేస్తామని తెలిపాయి. ఇక,ఈ ఆప్షన్‌ మే 1 నుంచి వినియోగించుకునే అవకాశం ఉందని పరిశ్రమల వర్గాలు అంచనా వేస్తున్నాయి.  

కాల్‌ ఐడీ ఉపయోగం ఏంటంటే?
టెక్నాలజీ వినియోగం పెరిగిపోతున్న కొద్దీ అవగాహనా రాహిత్యం వల్ల స్పామ్‌ కాల్స్‌, మెసేజ్‌ల వల్ల అనార్ధాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు ట్రాయ్‌ గత కొంతకాలంగా పనిచేస్తుంది. ముఖ్యంగా సైబర్‌ నేరస్తులు ఫేక్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లతో అమాయకుల బ్యాంక్‌ అకౌంట్లలో ఉన్న సొమ్మును కాజేస్తున్నారు. ఈ తరహా సైబర్‌ మోసాలపై దృష్టి సారించిన ట్రాయ్‌.. టెలికాం కంపెనీలకు కాల్‌ ఐడీని అందుబాటులోకి తెచ్చేలా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ కాల్‌ ఐడీ ఆప్షన్‌తో మనకు ఫోన్‌ చేసే వారి పేర్లు, ఫోటోలు మొబైల్‌ ఫోన్‌లపై డిస్‌ప్లే కానున్నాయి. ఇలా చేయడం వల్ల మనకు ఫోన్‌ చేసేది ఎవరనేది ముందుగా తెలుసుకొని జాగ్రత్త పడొచ్చని రెగ్యులేటరీ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.  

ససేమీరా అంటున్న టెలికాం కంపెనీలు
కానీ, ప్రైవసీ సమస్య కారణంగా ఎయిర్‌టెల్, జియో వంటి టెలికాం కంపెనీలు ఈ టెక్నాలజీని తీసుకురావడానికి వెనుకాడుతున్నాయి. అయితే దానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. వినియోగదారులకు ఇబ్బంది కలిగించే కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లను అరికట్టడానికి ఏఐ ఫిల్టర్ మాత్రమే మే 1 నుండి అమల్లోకి రానుందనేది వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి.  

చదవండి👉 వైరల్‌ అవుతున్న లలిత్‌ మోడీ ఆస్తుల విలువ.. ఎన్ని వేల కోట్లంటే?

మరిన్ని వార్తలు