5జీ స్పెక్ట్రం బేస్‌ ధర 35% తగ్గించవచ్చు

12 Apr, 2022 06:23 IST|Sakshi

ట్రాయ్‌ సిఫార్సు

న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రం వేలానికి సంబంధించి నిర్దిష్ట ఫ్రీక్వెన్సీల కనీస ధరను 35 శాతం మేర తగ్గించాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ సిఫార్సు చేసింది. 5జీ మొబైల్‌ సర్వీసులకు ఉపయోగించే 3300–3670 మెగాహెట్జ్‌ బ్యాండ్‌లో స్పెక్ట్రం రేటును మెగాహెట్జ్‌కు రూ. 317 కోట్లుగా నిర్ణయించవచ్చని పేర్కొంది. ట్రాయ్‌ గతంలో సూచించిన రూ. 492 కోట్లతో  (మెగాహెట్జ్‌కు) పోలిస్తే ఇది సుమారు 35 శాతం తక్కువని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక కీలకమైన 700 మెగాహెట్జ్‌ బ్యాండ్‌కు సంబంధించి బేస్‌ రేటును గతంలో ప్రతిపాదించిన దానికన్నా 40 శాతం తక్కువగా రూ. 3,927 కోట్లుగా నిర్ణయించవచ్చని ట్రాయ్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

700 మెగాహెట్జ్‌ మొదలుకుని 2500 మెగాహెట్జ్‌ వరకూ ఉన్న ప్రస్తుత ఫ్రీక్వెన్సీలతో పాటు కొత్తగా చేర్చిన 600, 3300–3670, 24.25–28.5 మెగాహెట్జ్‌ బ్యాండ్లను కూడా వేలంలో విక్రయించనున్నట్లు వివరించింది. టెలికం రంగం నిలదొక్కుకోవడానికి, దీర్ఘకాలంలో వృద్ధి సాదించడానికి.. పెట్టుబడులను ప్రోత్సహించడం, ద్రవ్య లభ్యతను పెంచడం, స్పెక్ట్రం కోసం సులభతర చెల్లింపుల విధానాలను అమలు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని ట్రాయ్‌ తెలిపింది. అత్యంత వేగవంతమైన 5జీ మొబైల్‌ సర్వీసులను 2022–23 ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి తెచ్చే దిశగా ఈ ఏడాదే స్పెక్ట్రం వేలం నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.   

మరిన్ని వార్తలు