రైల్వే ప్రయాణికులకు బంపరాఫర్‌.. మీ ట్రైన్ టికెట్ వెయిటింగ్‌ లిస్టులో ఉంటే ఫ్రీగా ఫ్లైట్‌ జర్నీ చేయొచ్చు!

25 Nov, 2022 19:42 IST|Sakshi

హైదరాబాద్‌లో ఉంటున్న రాము - సోము ఇద్దరు రూమ్‌ మెట్స్‌. రేపు ఉదయం 10 గంటల కల్లా ఆఫీస్‌కు రావాలంటూ ఢిల్లీ నుంచి ప్రముఖ టెక్‌ కంపెనీ నుంచి రాముకి ఇంటర్వ్యూ కాల్‌. 

అదే సమయంలో సోముకు రేపు ఉదయం పెళ్లి చూపులు ఉన్నాయంటూ బెంగళూరులో ఉంటున్న కుటుంబ సభ్యుల నుంచి పిలుపు. వెంటనే ఆ స్నేహితులిద్దరూ ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేసుకునేందుకు ప్రయత్నించారు. కానీ వెయిటింగ్‌ లిస్ట్‌ కనిపించడంతో నానా హైరానా పడ్డారు. ఇప్పుడు ఏం చేయాలిరా భగవంతుడా అని తల పట్టుకొని ఆలోచిస్తుండగా.. మీకు కావాల్సిన జర్నీ టికెట్స్‌ను ఉచితంగా మేం అందిస్తామంటూ ఓ సంస్థ నుంచి వచ్చిన వాట్సాప్‌ మెసేజ్‌తో ఎగిరి గంతేశారు. ఇంతకీ ఆ వాట్సాప్‌ మెసేజ్‌ పంపింది ఎవరు?  ఉచితంగా ఫ్లైట్ టికెట్లు అందించే ఆ సంస్థ కథాకమామిషు ఏంటో తెలుసుకుందాం? 

అత్యవసర సమయాల్లో ట్రైన్‌ టికెట్‌ బెర్తు కన్ఫం కాని ప్రయాణికుల కోసం ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ ట్రైన్‌మ్యాన్ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్‌ సాయంతో కన్ఫామైన ట్రైన్‌ టికెట్‌లను సొంతం చేసుకోవచ్చని తెలిపింది. ఆ సంస్థ ప్రతినిధులు చెప్పినట్లుగా ఒకవేళ ట్రైన్‌ టికెట్ కన్ఫం కానట్లయితే ప్రయాణీకులకు ఆయా రూట్లలో విమాన సదుపాయం ఉంటే  ఫ్రీగా ఫ్లైట్‌ టికెట్‌లను అందిస్తామని ప్రకటించింది. 

ట్రిప్ అస్యూరెన్స్
ట్రైన్‌ మ్యాన్ యాప్ 'ట్రిప్ అస్యూరెన్స్' అనే కొత్త ఫీచర్‌ను డెవలప్‌ చేసింది. కొత్త ఫీచర్ రైల్వే ప్రయాణీకులకు, సీట్లు వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉంటే..వారికి టికెట్లను కన్ఫం చేసి ఇస్తామని హామీ ఇచ్చింది. ఒకవేళ ప్రయాణీకుడు కన్ఫం టికెట్లను పొందనట్లయితే, యాప్ టికెట్‌ కన్ఫం అయ్యే అవకాశాలను ప్రిడిక్షన్ మీటర్‌లో చూపుతుంది. చార్ట్ తయారీకి ముందు టికెట్‌లు కన్ఫం కాకపోతే..ట్రిప్ అస్యూరెన్స్ ఫీచర్‌ సాయంతో చివరి నిమిషంలో ప్రత్యామ్నాయ ట్రైన్‌ రూట్లు, టికెట్‌ సదుపాయాల్ని గుర్తించి బుక్ చేసుకోవడంలో సహాయపడుతుంది.

ఛార్జీ రూ.1 మాత్రమే?
ప్రయాణీకుల టిక్కెట్ ప్రిడిక్షన్ మీటర్‌లో 90 శాతం లేదా అంతకంటే ఎక్కువ అని సూచిస్తే, యాప్ ట్రిప్ అస్యూరెన్స్ రుసుము రూ.1 వసూలు చేస్తుంది. ఒకవేళ శాతం 90 శాతం కంటే తక్కువగా ఉంటే, టికెట్ తరగతిని బట్టి కంపెనీ నామమాత్రపు ఛార్జీలను వసూలు చేస్తుంది. ముఖ్యంగా, చార్ట్ ప్రిపరేషన్ సమయంలో రైలు టికెట్ కన్ఫం అయినట్లయితే ఆ రుసుము కస్టమర్‌లకు రీఫండ్ చేయబడుతుంది. అయితే, టికెట్ బుక్‌ కాకపోతే  ప్రయాణికులకు ఉచితంగా ఫ్లైట్‌ టికెట్‌ బుక్‌చేస్తామని ట్రైన్‌ మ్యాన్‌  వ్యవస్థాపకుడు, సీఈవో వినీత్ చిరానియా అన్నారు. కాగా, ట్రిప్ అస్యూరెన్స్ సర్వీస్ ప్రస్తుతం అన్ని ఐఆర్‌సీటీ  రాజధాని రైళ్లలో, దాదాపు 130 ఇతర రైళ్లలో సేవల్ని అందిస్తోంది.

చదవండి👉 మీకు ఈ విషయం తెలుసా? డబ్బులు లేకున్నా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు!

మరిన్ని వార్తలు