చిన్న పట్టణాల్లోనే రుణాలకు అధిక డిమాండ్‌

23 Feb, 2023 01:06 IST|Sakshi

కొత్త కస్టమర్లలో మూడింట రెండొంతులు ఇక్కడి నుంచే

ముంబై: కొత్తగా రుణాలు తీసుకునే ప్రతి ముగ్గురిలో ఇద్దరు గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల నుంచే ఉంటున్నారని ట్రాన్స్‌ యూనియన్‌ సిబిల్‌ సంస్థ తెలిపింది. కొత్తగా రుణాలు తీసుకునే వారిలో మహిళలు, రైతులు, యువత ఉంటున్నట్టు తన తాజా నివేదికలో వెల్లడించింది. ఆర్థిక సేవల విస్తృతికి ఇది కీలకమని పేర్కొంది. 2021లో తొలిసారి రుణాలు తీసుకున్నవారు 3.5 కోట్లుగా ఉంటే, 2022లో జనవరి–సెప్టెంబర్‌ మధ్య కొత్తగా 3.1 కోట్ల మంది పెరిగినట్టు వెల్లడించింది. కొత్త రుణ ఖాతాదారులు (ఎన్‌టీసీ) అంటే అప్పటి వరకు ఎలాంటి రుణం తీసుకోకుండా, రుణ చరిత్ర లేని వారు అని అర్థం.

కన్జ్యూమర్‌ రుణాలు, వ్యక్తిగత రుణాలు, వ్యవసాయ రుణాలు, ద్విచక్ర వాహన రుణాలు, బంగారం రుణాలను వీరు తీసుకున్నారు. 2022 మొదటి తొమ్మిది నెలల్లో కొత్తగా రుణ చరిత్ర ఆరంభించిన కస్టమర్లలో 30 శాతం మేర కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌ రుణాలు తీసుకున్న వారు కావడం గమనార్హం. అంటే ఇంట్లో ఏసీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్‌ మెషిన్, స్మార్ట్‌ఫోన్‌ తదితర ఉత్పత్తుల కోసం తీసుకున్న రుణాలుగా వీటిని భావించొచ్చు. వీటి తర్వాత 16 శాతం మంది వ్యవసాయ రుణాలు తీసుకుంటే, 13 శాతం మేర వ్యక్తిగత రుణాలు తీసుకున్నట్టు ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ నివేదిక వివరించింది.  

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు